ఎయిర్‌టెల్ తొలి త్రైమాసిక నష్టాలు రూ. 15,933 కోట్లు!

by Harish |
ఎయిర్‌టెల్ తొలి త్రైమాసిక నష్టాలు రూ. 15,933 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో రూ. 15,933 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన రూ. 5,237 కోట్ల పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఇక, గతేడాది ఇదే త్రైమాసికంలో టెలికాం దిగ్గజం రూ. 2,866 కోట్ల నష్టాలను నమోదు చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిలు రూ. 36,832.2 కోట్లను చెల్లించింది. అలాగే, ఎయిర్‌టెల్ కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15.4 శాతం పెరిగి రూ. 23,938.7 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 20,737.9 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారు సగటు ఆదాయం గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 129 నుంచి ఈసారి రూ. 157 కు పెరిగినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయాలు రూ. 10,639 కోట్లకు చేరాయని, ఆపరేటింగ్ మార్జిన్ 44.4 శాతంగా ఉందని ఎయిర్‌టెల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, కంపెనీ 4జీ డాటా వినియోగదారులు జూన్ త్రైమాసికానికి 13.83 కోట్లకు పెరిగారని కంపెనీ పేర్కొంది. తాము కొవిడ్-19 వల్ల తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. అయినప్పటికీ..సంస్థ ఉద్యోగులు అరుదైన సేవలందించారు. ఎప్పటికప్పుడు వినియోగదారులతో అనుసంధానం కలిగి ఉన్నామని, డేటా ట్రాఫిక్ 73 శాతం వృద్ధి సాధించినట్టు భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, సౌత్ ఏషియా ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed