పెరిగిన ఎయిర్‌టెల్ కస్టమర్లు!

by Harish |
పెరిగిన ఎయిర్‌టెల్ కస్టమర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, మరో దిగ్గజం రిలయన్స్ జియోకు గట్టి పోటీని ఇస్తోంది. ఇటీవల కొత్త చందాదారులను సంపాదించుకోవడంలో జియోను అధిగమిస్తున్న ఎయిర్‌టెల్.. సెప్టెంబర్‌లో జియో కంటే రెట్టింపు స్థాయిలో కొత్త చందాదారులను సంపాదించుకుంది. సెప్టెంబర్ నెలలో ఎయిర్‌టెల్ మొత్తం 38 లక్షల మంది కొత్త చందాదారులను సంపాదించుకోగా, రిలయన్స్ జియో 15 లక్షల మంది వినియోగదారులను మాత్రమే సాధించగలిగింది.

ఈ వృద్ధితో ఎయిర్‌టెల్ నాలుగేళ్ల తర్వాత ఈ ఘనతను సాధించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఎయిర్‌టెల్ వరుసగా రెండో నెల జియోను అధిగమించి ఎయిర్‌టెల్ కొత్త వినియోగదారులను సంపాదించుకోగా, మరో దిగ్గజ టెలికాం వొడాఫోన్ ఐడియా ఈసారి కూడా కస్టమర్లను పోగొట్టుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి రిలయన్స్ జియో కొత్తగా 0.36 శాతం మందిని పెంచుకుని మొత్తం 40.41 కోట్ల వినియోగదారులతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 1.17 శాతం కస్టమర్లు పెరిగి 32.66 కోట్ల వినియోగదారులను కలిగి ఉంది.

వొడాఫోన్ ఐడియా 47 లక్షల మందిని పోగొట్టుకుని 29.55 కోట్లకు తగ్గింది. ఈ సంఖ్యల పరంగా రిలయన్స్ జియో టెలికాం మార్కెట్ వాటా 35.1 శాతం ఉండగా, ఎయిర్‌టెల్ 28.4 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. వొడాఫోన్ ఐడియా 25.7 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed