హైదరాబాద్‌ను కలవర పెడుతోన్న వాయు కాలుష్యం

by Anukaran |   ( Updated:2021-11-14 21:54:37.0  )
Air pollution
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న సాంకేతికతతో పాటు పరిశ్రమల స్థాపన, వాహనాలు పెరుగుదల, పండుగల సమయంలో క్రాకర్స్‌ను కాల్చడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7.5 శాతం కాలుష్యం పెరిగినట్లు పీసీబీ అధికారుల లెక్కల్లోనే వెల్లడవుతోంది. ఇలాగే పెరిగితే భవిష్యత్‌లో ప్రమాదమని, మానవ మనుగడకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాయు కాలుష్యం పెరుగుతోందని, గాలినాణ్యత సూచితో 0-50 పాయింట్లు ఉంటే మంచి వాతావారణం అని అధికారులు పేర్కొంటున్నారు. 50 నుంచి 100 పాయింట్లకు పెరిగితే ఆరోగ్యపరంగా సున్నితంగా ఉండేవారిపై ప్రభావం చూపుతోందని, 101 నుంచి 200 పాయింట్ల మధ్య ఉంటే ఆస్తమా, గుండె జబ్బులు, 201 పాయింట్ల నుంచి శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ నాళికలలో ఉండే శ్లేష్మం తీవ్రంగా ప్రభావితమైంది. వాటిల్లో వాపు వల్ల సామాన్యులకు దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

గాలిలో కాలుష్య కారకాలు పెరగడం వల్ల ఆస్తమా, సీఓపీడీ, క్రానిక్ పల్మనరీ లంగ్ డిసీజ్ రోగుల సమస్యలు సాధారణ రోజులతో పోలిస్తే పెరిగినట్లు వైద్యుల అంచనా. ఇదిలా ఉంటే ఈ చలికాలం సీజన్‌లో బలమైన గాలి లేకపోవడం వల్ల, గాలిలో ఉండే కాలుష్యం శ్వాసకోశ సంబంధిత వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను పెంచుతోంది. రోగనిరోధక శక్తి పరంగా బలహీనమైన వ్యక్తులకు ఈ వ్యాధులు సులభంగా అంటుకుంటాయి.

చెత్తను కాల్చడంతో పాటు వాహనాలు, పరిశ్రమలతో నిత్యం 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతాయి. వీటిలో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు అత్యంత ప్రమాదకరం. మనిషి తల వెంటుక మందం 50 మైక్రోగ్రాములు ఉంటాయి. 5 రెట్లు తక్కువగా ఉండే సూక్ష్మ ధూళి కణాలు… స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. తలవెంట్రుక మందంలో ఉండి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యల కారణమవుతున్నాయి.

గాలిలో సూక్ష్మ, ధూళి తీవ్రత 60 ఎంజీలు మించరాదు. బాలానగర్ లో 69 నుంచి 107, చార్మినార్ లో 77 నుంచి 111, జీడిమెట్లలో 58 నుంచి 102, జూపార్కు వద్ద 33 నుంచి 116 ఎంజీలు, ఉప్పల్ లో 54 నుంచి 96, జూబ్లీహిల్స్ లో 53 నుంచి 82 ఎంజీలు, ప్యారడైజ్ లో 69 నుంచి 85, ట్యాంక్ బండ్ లో 41 నుంచి 54 ఎంజీలు, ఎంజీబీఎస్ లో 44 నుంచి 76, చిక్కడపల్లిలో 48 నుంచి 59, మాదాపూర్ లో 37 నుంచి 68, కూకట్ పల్లిలో 51 నుంచి 85 ఎంజీలు, నాచారంలో 40 నుంచి 67, కేబీఆర్ పార్కు వద్ద 23 నుంచి 43 ఎంజీలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా క్యూబిక్ మీటర్ గాలిలో సూక్ష్మ ధూళి 40 ఎంజీలు దాటొద్దు. అయితే దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలు అధికంగా టపాసులు కాల్చడంతో ఒక్కసారిగా కాలుష్యం తీవ్రంగా పెరిగింది.

సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో కాలుష్యం పలుప్రాంతాల్లో రెట్టింపు అయింది. సనత్ నగర్ లో అత్యధికంగా కాలుష్యం పెరిగింది. 7 నుంచి 39 ఎంజీలుగా నమోదు కాగా, హెచ్సీయూ లో 7 నుంచి 37 ఎంజీలు, చార్మినార్ లో 16 నుంచి 25, జీడిమెట్లలో 18 నుంచి 28 ఎంజీలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాలుష్యం పెరగడానికి ఉష్ణోగ్రతలు తగ్గడంతోనే అక్టోబర్ లో కాలుష్యం పెరిగినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతోనే ధూళి కణాల తీవ్రత పెరిగినట్లు పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.

వేసవిలో వాతావరణం పొడిగి ఉండటంతో గాల్లో నుంచి వెలువడిన కాలుష్య ఉద్గారాలు అటు… ఇటు ప్రయాణిస్తుంటాయి. అదే శీతాల కాలంలో మంచు ఉండటంతో ఎటు కదలకుండా భూమిపై కొద్ది మీటర్ల ఎత్తులోనే ఉండిపోతాయి. దీంతో ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించి కాలుష్యం నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ప్రజల్లో అవగాహన పెంచాలి

Shashikala

ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ కాలుష్యం పెరుగుదలకు కారణమవుతున్నారు. చెత్తను తగులబెడుతూ పరోక్షంగా కారణమవుతున్నారు. చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. పండుగ సమయాల్లో ప్రజలు పటాకులు కాల్చకుండా నిరోధించడంతో పాటు అమ్మకాలను నియంత్రించాలి. గ్రీన్ కాకర్స్ కాల్చేలా చర్యలు చేపట్టాలి. కాలుష్యం పెరిగితే కలిగే నష్టాలపై ప్రభుత్వం ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి.

-డాక్టర్ శశికళ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ

Advertisement

Next Story

Most Viewed