బహిరంగ చర్చకు సిద్ధమా ?

by Shyam |
బహిరంగ చర్చకు సిద్ధమా ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడీని అరికట్టడంలో, సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్ నాయకులకు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే చిత్తశుద్ధి నిజంగా ఉంటే, బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని, తేది, సమయం, స్థలం ఎప్పుడైనా, ఎక్కడైనా, ప్రత్యక్షంగనైనా, కొవిడ్ పరిస్తుల వల్ల వర్చ్యువల్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఐనా నేను సిద్ధం అని సవాల్ చేశారు. మీ ఇష్ట ప్రకారం ఒక సీనియర్ పాత్రికేయుడిని సమన్వయకర్తగా, మీ వేసులుబాటును బట్టి తేది, సమయం, స్థలం తెలియజేయాలని వంశీ‌చంద్‌రెడ్డి కోరారు.

నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అడ్డుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ పనులకు టెండర్లు దాఖలు చేసే ప్రతీ కాంట్రాక్టరుని తెలంగాణలో బ్లాక్ లిస్ట్ చేయడమెగాక, గతంలో కేటాయించిన పనులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో విఫలమైతే, ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పి) కాదని, కేవలం అప్లికేషన్ ఫర్ డైరెక్షన్స్ (ఆదేశాల కోసం దరఖాస్తు) అని, ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్లకు అనుకూలంగా కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed