నిలువెల్లా ఎండింది.. రైతులను ముంచింది...!

by Nagaya |
నిలువెల్లా ఎండింది.. రైతులను ముంచింది...!
X

దిశ, తుంగతుర్తి: ఎప్పటి మాదిరిగానే లాభాలను తెచ్చి పెడుతుందనుకున్నారు కొందరు. గతం కంటే మరింత లాభం పొందాలనుకున్నారు మరికొందరు. అనుకున్నట్టుగానే రైతాంగం గంపెడు ఆశలతో మిరప తోటలను సాగు చేశారు! మెల్లిమెల్లిగా పంట అంతా ఎదుగుతూ పూసేపూలతో సంబరపడ్డారు. పూలన్నీ కాయలుగా కాస్తుంటే అవధులు లేని ఆనందాలు...! అంతలోనే ఏమైందో ఏమో కానీ... కాసిన కాయలు... పూచిన పూలు రాలడం మొదలుపెట్టాయి. కాండం నుండి మొదలు చెట్టుపై వరకు చిత్రమైన రీతిలో రంగులు మారుతూ ఎండిపోతున్నాయి. చివరికి రైతు వాటిని కాపాడుకోవడానికి చేయని సాహసం అంటూ లేదు. కళ్ళ ముందు మాడిపోతుంటే చేసేదేమీ లేక ఆవిరైన ఆశలతో దుఃఖమే అలుముకుంది. ప్రస్తుతం వారంతా లక్షల్లో మునిగి నష్టాలను మూటగట్టుకున్నారు.

తుంగతుర్తి మండలంలోని మిరప రైతుల కంట చుక్క చుక్కగా కారిన కన్నీటి బొట్టు కథ ఇది. ఈ ఏడాది మండలంలోని మానాపురం, రావులపల్లి, జొన్నలగడ్డ తండా, రావులపల్లి క్రాస్ రోడ్డు, బాపనిబావి తండా తదితర ప్రాంతాల్లో రైతులు వందలాది ఎకరాలలో మిరప పంట సాగును చేశారు. అయితే సాగు మొదలుకొని చెట్టు ఎదిగి పంట చేతికొచ్చే సమయంలోనే చిత్రమైన రోగాలు సోకాయి. పలువురి సూచనల మేరకు సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, దంతాలపల్లి, తుంగతుర్తి తదితర ప్రాంతాల నుండి పంటను కాపాడుకోవడానికి అవసరమైన మందులన్నీ తెచ్చి వాడారు. అయినా డబ్బు ఖర్చయిందే తప్ప పంటలో మార్పు రాలేదు. చూస్తుండగానే పంట అంతా ఎండిపోయింది.

లక్షల్లో నష్టం....

ముఖ్యంగా ప్రతి ఏటా రైతులకు లాభాలను సమకూర్చేది మిరప పంటే. ఒక ఎకరంలో సక్రమంగా పండితే 30 నుండి 40 క్వింటాళ్ల పంట చేతికి వస్తుంది. దీనికి అయ్యే ఖర్చు రూ.మూడు లక్షల లోపే. ఈ మేరకు మిరప క్వింటా ఒక్కంటికి రూ.20 వేల పైనే మార్కెట్లో ధర పలుకుతోంది. ఈ లెక్కన రైతుకు ప్రతి ఏటా లక్షల్లో రాబడి వస్తుంది. అయితే ఈసారి లాభాల మాట దేవుడు ఎరుగు.. మిరప చెట్లన్నీ లాభాలకు బదులుగా నష్టాలనే విపరీతంగా కాసింది. దీంతో నష్టాలే రైతుకు దిగుబడిగా తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా మానాపురం గ్రామంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గ్రామంలో తేజ మిరపకాయతో పాటు వివిధ రకాల పచ్చళ్ళలో వినియోగించే దొబ్బ పండు పంట కూడా తెగుళ్లతో పూర్తిగా ఎండిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed