- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తర తెలంగాణలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు..!
దిశ, వరంగల్: తెలంగాణలో మళ్లీ అన్నల అలజడి మొదలైందనీ, ఉత్తర తెలంగాణ జిల్లాలోకి అన్నలు అడుగుపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చత్తీస్‌గఢ్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులు దాటి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ విషయమై రెండ్రోజులుగా పోలీస్ శాఖ వరుస ప్రకటనలు విడుదల చేయడం ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సరిహద్దుల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. కొంతమంది ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసిన మావోయిస్ట్ యాక్షన్ టీంలు జిల్లాల్లోకి ప్రవేశించాయనే నేపథ్యంలో రాజకీయ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పోలీసులు సరిహద్దు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
కూంబింగ్‌లతో జల్లెడ..
నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూర్ నాగారం ఏజెన్సీ ప్రాంతం అన్నలకు కంచుకోటగా ఉండేది. మావోయిస్ట్ పార్టీలో కోవర్టులు పెరిగిన కారణంగా పోలీస్ నెట్‌వర్క్ బలపడటంతో పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీంతో మావోయిస్ట్‌లు తమ మకాంను చత్తీస్‌గఢ్‌కు మార్చారు. వీలు చిక్కినప్పుడల్లా గోదావరి తీరం వెంట జిల్లాలోకి వచ్చి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెలల కిందట సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన రోజు గోదావరి సరిహద్దులోకి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వచ్చి వెళ్లారనే ప్రచారం జరిగింది. అంతకు ముందు తాడ్వాయి మండలం కాల్వపల్లిలో ఇన్‌ఫార్మర్‌ను మావోయిస్టులు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా గ్రహించిన పోలీస్ ఉన్నతాధికారులు సరిహద్దు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ బదిలీ చేశారు. ములుగు, ఏటూర్ నాగారం, పస్రా, మహదేవపూర్, కాటారం ఠాణాలకు ఆయా ప్రాంతంలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆనాటి నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలు సరిహద్దు జిల్లాలను కూంబింగ్ పేరుతో జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తుండటం అడవుల్లో ఆకులు రాలుతుండటంతో పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
సరిహద్దు గ్రామాల్లో వందలమంది పోలీసులు
చత్తీస్‌గఢ్ నుంచి సరిహద్దు ప్రాంతాల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం మేరకు పోలీస్ బలగాల కూంబింగ్‌తో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు గోదావరి పరీవాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టుల వేట ప్రారంబించారు. మాజీలు, ఇన్ ఫార్మర్ల సాయంతో ఆయా మావోల డెన్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు ములుగు, జయశంకర్ భూపాలపల్లి సరిహద్దు గ్రామాలకు మిర్చి ఏరేందుకు వస్తున్నారు. వీరంతా గోదావరి తీరం వెంట గూడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కూలీలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల ప్రత్యేకంగా పోలీసులు హెలికాప్టర్ల సాయంతో సరిహద్దు గ్రామాలను గాలించారు. మావోయిస్టుల స్థావరాలను కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలు కూడా వినియోగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసరాల్లో భారీ పోలీస్ బలగాలను మోహరించారు.
పరస్పర లేఖలతో ఆందోళన..
ఇటీవల మావోయిస్టులు, పోలీసులు పరస్పరం విడుదల చేసిన లేఖలతో ఆయా వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా మావోయిస్టులకు టార్గెట్ ఉన్న నేతలు టెన్షన్ పడుతున్నారు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులపై నిఘా ఉంచారు. నేతలను గ్రామాలకు రావొద్దని సూచిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఒక పోలీస్‌ను మావోయిస్టులు హతమార్చడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరువర్గాల మధ్య కవ్వింపు చర్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Tags: maoist movement, police alert, warangal district