కొడుకు పాల కోసం ప్రధానికి ట్వీట్.. తక్షణమే అందించిన యంత్రాంగం

by Shyam |   ( Updated:2020-04-12 02:28:58.0  )
కొడుకు పాల కోసం ప్రధానికి ట్వీట్.. తక్షణమే అందించిన యంత్రాంగం
X

దిశ వెబ్ డెస్క్ :
కరోనా వేళ.. ఒక్కోక్కరిది ఒక్కో ధీన గాథ. తల్లికి మందులు కావాలంటూ.. ఓ కూతురు పడే ఆవేదన. కొడుకు కోసం.. 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి. భార్యకు కేన్సర్ చికిత్స అందించడం కోసం.. ఆమెతో కలిసి 1300 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన భర్త. హృదయాన్ని కదిలించే సంఘటనలు ఎన్నో మనముందు నిలుస్తున్నాయి. అదే విధంగా .. ఆటిజంతో బాధపడుతున్న తన మూడున్నరేళ్ల కుమారుడికి ఒంటె పాలు దొరకకపోవడంతో.. ఓ తల్లి హృదయం తల్లడిల్లింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడికి పోలేని పరిస్థితి. చేసేదేం లేక.. తన కొడుకుకు ఒంటె పాలు సమకూర్చలంటూ ప్రధానికి ట్వీట్ చేసింది. తక్షణమే స్పందించిన పీఎం ఆఫీసు అధికారులు ఆ తల్లికి 20 లీటర్ల ఒంటె పాలు అందించారు. పాల కోసం ప్రత్యేక రైలును ఉపయోగించడం విశేషం.

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. దాంతో దేశమంతా లాక్ డౌన్ కఠినంగా అమలు జరుగుతోంది. అంతేకాదు మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించడమే మార్గంగా కనిపిస్తుంది. కరోనా కేసులు పెరగడమే అందుకు కారణం. ముఖ్యంగా మన దేశంలో మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ 1761 పాజిటివ్ కేసులున్నాయి. ఒక్క శనివారమే 187 కేసుల నమోదయ్యాయి. కరోనా కారణంగా 242 మంది చనిపోయారు. అందువల్ల మహారాష్ట్రలో ఎవరూ ఇల్లు కదిలే వీలు లేదు. దాదాపు 20 రోజుల నుంచి అందరూ ఇల్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ముంబైలోని బాంద్రాలో నివసిస్తున్న నేహా కుమారి తనయుడికి ఒంటె పాలు అందడం లేదు. ‘‘నరేంద్ర మోదీ గారు.. నాకు 3.5 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆటిజంతో పాటు, పలు అలర్జీలతో బాధపడుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఒంటె పాలు దొరకడం లేదు. ఆటిజం ఉన్న వారికి ఆవు, గేదె పాలు ఆరోగ్యకరం కావు. ఒంటె పాలను కానీ లేక రాజస్థాన్‌లోని సాద్రీలో లభ్యమయ్యే పాల పౌడర్‌ను కానీ అందించండి’ అంటూ ఆమె ప్రధానికి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై స్పందించిన వాయువ్య రైల్వే చీఫ్ పాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ తరుణ్ జైన్ అధికారులతో చర్చించి.. ఓ ప్రత్యేక రైలులో 20 లీటర్లను పాలను సమకూర్చారు. అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు.
నేహా కుమారి తనకు అందిన పాలను స్థానికంగా నివసించే మరికొందరికి అందించి తన గొప్ప మనస్సును చాటుకుంది. ఈ సందర్భంగా ప్రధానికి, రైల్వే అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


Tags: corona virus, lockdown, camel milk, mother love, autism, mumbai, railway, pm, twitter

Advertisement

Next Story