థర్డ్ వేవ్ ఎలా విరుచుకుపడుతుందో ఊహించలేం : కేంద్రం

by Shamantha N |
థర్డ్ వేవ్ ఎలా విరుచుకుపడుతుందో ఊహించలేం : కేంద్రం
X

న్యూఢిల్లీ : సెకండ్ వేవ్‌లో కరోనా వలన దేశమంతా అల్లకల్లోలం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ రాక అనివార్యమని తేల్చి చెప్పింది. అయితే అది ఎప్పుడు, ఏ విధంగా విరుచుకుపడుతుందో మాత్రం స్పష్టత లేదని తెలిపింది. ఈ మేరకు దేశంలో కొవిడ్ పరిస్థితులపై ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కె. విజయ్ రాఘవన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. విజయ్ రాఘవన్ మాట్లాడుతూ.. ‘దేశంలో ప్రస్తుతం వైరస్ సంక్రమణను బట్టి చూస్తే కరోనా థర్డ్ వేవ్ (మూడో దశ) రావడం అనివార్యం. అయితే అది ఎప్పుడు, ఏవిధంగా విరుచుకుపడుతుందోననే విషయంపై మాత్రం స్పష్టత లేదు. దాంతోపాటు మరిన్ని వేవ్ (కరోనా దశలు) ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి’ అని హెచ్చరించారు.

వైరస్ ఇప్పటికే దాని వేరియంట్స్‌ను మార్చుకుంటూ జనాలపై దాడి కొనసాగిస్తుందని రాఘవన్ అన్నారు. రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకుంటూ, వ్యాధి తీవ్రతను ఎక్కువ చేసే మ్యూటేషన్లు పెరిగాయని, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి ఇది ఒక ప్రధాన కారణమని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని మ్యూటెంట్లు విరుచుకుపడే అవకాశం ఉన్నదని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు వాటిని ముందుగానే గుర్తించి, అరికట్టేందుకు భారత్‌లో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చర్యలు చేపట్టారని సూచించింది.

వైరస్ రూపాంతరం చెందుతున్న తరుణంలో దానికి తగినట్టుగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేసుకోవడం ఎంతో అవసరమని విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు. భారత్‌లో కొద్దిరోజులుగా వైరస్ విజృంభణ, ప్రపంచవ్యాప్తంగా దాని వ్యాప్తిని బట్టి థర్డ్ వేవ్ తప్పదని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఇదే విషయమై ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా వ్యాఖ్యానిస్తూ.. కరోనా వైరస్ రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా అభివృద్ధి చెందితే దేశంలో థర్డ్ వేవ్ తప్పదని చెప్పిన మరుసటి రోజే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు రావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed