- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ఆర్మిలో ఆర్టిఫిషియల్ ఇంజలిజెన్స్! లాభాలెన్ని!
ఈ సృష్టిలోని సకల ప్రాణికోటిలో తెలివితేటలు కలిగి స్వంతంగా ఆలోచించడమే కాక, తన ఆలోచనలను ఇతరులకు తెలియచేసి వారి ద్వారా పనులు చేయించుకోగలిగిన సామర్థ్యం కలిగిన ప్రాణి కేవలం ఒక్క మానవుడే. కొన్ని జంతువులకు తెలివితేటలు, ఆలోచనా శక్తి ఉన్నప్పటికీ అది వాటి వరకే పరిమితం. తమ ఆలోచనలను ఇతర జంతువులతో పంచుకుని వాటి ద్వారా పనులు చేయించుకోలేవు. మానవుడు తనకన్నా ఎంతో శక్తివంతమైన క్రూర మృగాలను సైతం తన తెలివితేటలు, ఆలోచనాశాక్తితో లొంగదీసుకుని, వాటికి శిక్షణ ఇచ్చి పని కూడా చేయించుకోగలుగుతున్నాడు. శాస్త్ర సాంకేతికంగా ఎంతో పురోగతి సాధిస్తూ ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు.
కొన్ని దశాబ్దాల క్రితమే మానవ మేధస్సుతో ఆవిష్కృతమైన కంప్యూటర్ 'ఇంతింతై వటుడింతై' అన్నట్లు మానవ జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. నేడు కంప్యూటర్ లేని రంగాన్ని మనం ఊహించలేం. కొన్ని ప్రమాదకర, క్లిష్టమైన పనులను చేయడం కోసం ఇప్పటికే రోబోట్‌లకు పురుడు పోసిన మానవుడు మరొక అడుగు ముందుకు వేసి విప్లవాత్మక "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" (కృత్రిమ మేధస్సు) కు నాంది పలికాడు. డేటా సైన్స్‌లో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కంప్యూటర్‌లో ముందస్తుగా నిక్షిప్తం చేయబడిన సమాచారం మేరకు అవి ప్రామాణికతలను పాటిస్తూ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయగలవు.
ఎప్పుడు మొదలైంది?
1991లో మొట్టమొదటిసారి అమెరికా సైన్యం 'డైనమిక్ అనాలిసిస్ అండ్ రీప్లానింగ్ టూల్' (DART) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంను సైనికులు, సరుకు తరలింపు, ఇతర రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించింది. స్వయంసంచాలిత ప్రాణాంతక వ్యవస్థలలో భాగాలైన 'స్లాటర్ బోట్స్' లేదా 'కిల్లర్ బోట్స్' మానవ ప్రమేయం లేకుండా శత్రువులను గుర్తించి మట్టుబెట్టగలవు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ ఆయుధాలు ప్రతికూల వాతావరణంలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సైనికులు ఏక కాలంలో బహుళ కార్యాలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భౌగోళిక విశ్లేషణతో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ వివిధ ఆయుధాలతో అనుసంధానించబడిన రాడార్లు, ఇతర ఉనికిని పసిగట్టే వ్యవస్థల ఆధారంగా చట్టవ్యతిరేక, అనుమానాస్పద కార్యకలాపాలను పసిగట్టి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక దళాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో భాగంగా అభిజ్ఞాత్మక రాడార్, 5-జి సెల్యులార్ నెట్‌వర్క్, మైక్రోచిప్స్, సెమికండక్టర్స్, అనలిటిక్ ఇంజిన్స్ లాంటి వాటి కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాక ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేసర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారత సైన్యంలో వాడకం
చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకునే మన దేశం దుర్భేధ్య నైసర్గిక స్వరూపం గల ప్రాంతాలను ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను సైన్యానికి అప్పగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎన్నో ఉపకరణాలను వినియోగించి సైనికులు ప్రమాదాల బారినపడే సందర్భాలను గణనీయంగా తగ్గించగలిగిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. అనూహ్య, ప్రతికూల పరిస్థితులలో కూడా సైనికుల సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుంది, సైనికులకు యుద్ధక్షేత్రంలో రోబోట్ల ద్వారా సేవలందిస్తుంది. చీకటిలో, దట్టమైన ప్రాంతాలలో సాధారణ కంటిచూపునకు కనిపించని ప్రదేశాలలో దాక్కొని ఉన్న శత్రువులను సైతం పసిగట్టడంలో ఉపకరిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ హక్కులు కలిగిన పది దేశాలలో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది. చైనా, అమెరికా, జపాన్ మొదటి మూడు స్థానాలో, రష్యా, ఫ్రాన్స్ భారత్ తరువాత స్థానంలో ఉన్నాయి. సాధారణంగా రోబోట్లను పేలుడు పదార్థాల ఉనికిని పసిగట్టడం, వాటిని నిర్వీర్యం చేయడం, నిఘా, తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. ఆయుధాలను ఉపయోగించే రోబోట్లు మాత్రం టెలిస్కోపిక్ విధానం ద్వారా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి శత్రువుల ప్రాణాలను హరించలేవు. రోబోటిక్స్, సైనిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులో ముందంజలో ఉన్న చైనా తాను హెవీ డ్యూటీ రోబోట్‌ను రూపొందించినట్లు ప్రకటించింది.
2018లో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సిఫార్సుల మేరకు కనీసం 75 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను భారత్ వినియోగించుకుంటోంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్ ఫిబ్రవరి 2019లో 'డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్' (DAIC) 'డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ ఏజెన్సీ (DAIPA) ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఈ రెండు సంస్థలు భారత సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు అనుసరించాల్సిన విధానపర మార్పుల గురించి మార్గదర్శనం అందిస్తాయి.
ప్రపంచంలోనే అత్యంత అధునాతన అమెరికా సైన్యం ఆగష్టు 2018 లో టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు కోసం ప్రత్యేకంగా 'US ఆర్మీ ఫ్యూచర్స్ కమాండ్' (AFC) ఏర్పాటు చేసింది. జూలై 2018 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రణాళిక ను ప్రకటించిన చైనా 2030 నాటికి ఈ విభాగంలో ప్రపంచంలో అగ్ర స్థానానికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పాకిస్తాన్ ఆగష్టు 2020లో రావల్పిండిలోని చక్లాలా లో 'సెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటింగ్" ప్రారంభించగా, దాని మిత్ర దేశం టర్కీ 'టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్'ను 2018లో ప్రారంభించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు ద్వారా భారత సైన్యం ఎలా బలోపేతమవుతోందో రక్షణ శాఖ అధికారులు 'ది సండే గార్డియన్' మ్యాగజైన్ తో పంచుకున్నప్పటికీ, భద్రతాపర కారణాల కొంత సంక్లిష్ట సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఉపకరణాలను, రహస్య మానవ కార్యకలాపాలు, అనుమానాస్పద వాహనాల కదలికలు (పుల్వామా ఉగ్రవాద దాడి లాంటి ఘటనల నిరోధానికి), పాకిస్తాన్ తీవ్రవాదులు తమ దాడుల ప్రణాళికల గురించి ప్రాంతీయ యాసతో ఉర్దూ, పంజాబీ, ఇతర స్థానిక భాషలలో జరిపే సంభాషణల సారాన్ని విశ్లేషించడానికి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
గత నాలుగేళ్లలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రగతిని పరిగణనలోకి తీసుకున్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ మున్ముందు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఉపకరణాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు సరిపడినన్ని నిధులు కేటాయించి ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఏదేమైనప్పటికీ మానవ మేధస్సు మానవ జాతి పురోగమనానికి, పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి దోహద పడేలా ఉండాలి తప్ప తిరోగమనానికి లేదా విధ్వంసానికి హేతువు కాకూడదు. ఏమంటారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపకరణాలు
* స్టార్మ్ డ్రోన్
* డ్రోన్ ఫీడ్ అనాలిసిస్
* సీకర్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ సిస్టం
* మాండరిన్ ట్రాన్స్లేటర్స్
* ప్రాజెక్ట్ ప్రిస్మ్
* ప్రాజెక్ట్ వి-లాగర్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం
* సర్వత్రా పహచాన్
* సైలెంట్ సెంట్రీ
* ఏఐ బేస్డ్ ఇంటర్ సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టం
* చౌకాస్
* ఏఐ కేపబిలిటి in స్వార్మ్ డ్రోన్స్
* సాపర్ స్కౌట్, మైన్ డిటెక్షన్ UGV
* ఏఐ బేస్డ్ శాటిలైట్ ఇమేజరీ అనాలిసిస్
యేచన్ చంద్ర శేఖర్
హైదరాబాద్
88850 50822