కంటిన్యూ ఫైనాన్స్ పేరుతో వాహనాలకు అడ్వాన్స్.. నకిలీ పత్రాలతో ఇతరులకు విక్రయం.

by Shyam |   ( Updated:2021-12-10 07:41:52.0  )
కంటిన్యూ ఫైనాన్స్ పేరుతో వాహనాలకు అడ్వాన్స్.. నకిలీ పత్రాలతో ఇతరులకు విక్రయం.
X

దిశ, మిర్యాలగూడ: కంటిన్యూ ఫైనాన్స్ పేరుతో వాహనాలకు అడ్వాన్స్ చెల్లించి నకిలీ పత్రాలతో ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను శుక్రవారం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నిగిడాల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ కు చెందిన గండికోట లక్ష్మి నారాయణ, తుర్కయంజల్ కి చెందిన పలావత్ కిషన్ లు కంటిన్యూ ఫైనాన్స్ పేరుతో పలువురి వద్ద కార్లు, ఇతర భారీ వాహనాలకు అడ్వాన్స్ లు చెల్లించి తీసుకెళ్లేవారు.

అట్టి వాహనాలను కిరాయికి నడుపుతూ.. ఫైనాన్స్ బకాయిలు చెల్లించకుండా యజమానులను మోసగించారు. అంతే కాకుండా కార్ల ఫైనాన్స్ క్లియర్ చేసినట్లు నకిలీ బ్యాంకు పత్రాలు సృష్టించి కడప కు చెందిన షరీఫ్ వద్ద 22 లక్షలకు తాకట్టు పెట్టేందుకు మిర్యాలగూడ రెడ్డి కాలనీ లోని శ్రీ సాయి కార్ బజార్ షెడ్లో 6 కార్లు 1 డీసీఎం వ్యాన్ ను దాచి ఉంచారు. ఇదే తరహాలో హాలియా నుంచి మరో వాహనం తెచ్చేందుకు నిందితులిద్దరూ శుక్రవారం కారులో వెళ్తుండగా ఎస్సై మోహన్ బాబుకు పట్టు బడినారు.

పోలీసుల విచారణలో నిందితులు నేరం ఒప్పుకోగా వారి వద్ద నుంచి మొత్తం 6 కార్లు, 1 డీసీఎం వాహనం, 2 సెల్ ఫోన్లు, 15 నకిలీ స్టాంపులు, ఇతర పత్రాలను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సురేష్, ఎస్సై మోహనబాబు లను ఎస్పీ రంగనాథ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు లు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed