ఆదిలాబాద్ జిల్లాలో భయం భయం

by Anukaran |   ( Updated:2021-01-30 13:24:49.0  )
ఆదిలాబాద్ జిల్లాలో భయం భయం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో భయం మొదలైంది. అటవీ పరిసర గ్రామాలు, జనావాసాల్లోకి పెద్దపులులు, చిరుతపులులు సంచరించ టం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని చంపగా.. ప్రతి రోజూ ఏదో ఓ ప్రాంతంలో మనుషులు, పశువులపై దాడి కి పాల్పడుతున్నాయి. 5 నెలల క్రితం కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దిగడలో ఓ గిరిజన యువకుడు, పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో మరో గిరిజన బాలికపై పెద్దపులి దాడి చేసి చంపేసింది.

ఈ ఘటనలు మరువక ముందే.. ఇతర ప్రాంతాలు, గ్రామాల్లోనూ పెద్దపులులు, చిరుత పులుల సంచరిస్తూ మనుషులు, పశువులపై దాడులు చేస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట చిరుతలు, పెద్దపులులు సంచరిస్తూ ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అటవీ పరిసర గ్రామాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడెం కు చెందిన వారితో పాటు ఉమ్మడి జిల్లాలోని చాలా చోట్ల జనం చేలకు, పొలలకు, అడవికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఇటీవల తానూరు, కుభీర్ మండలాల్లో పెద్దపులి, చిరుతపులులు మనుషులు, పశువులపై దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి. పెద్దపులులు, చిరుతలు సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం ధ్రువీకరించటం కలకలం రేకెత్తిస్తోంది.

ఆపరేషన్ మ్యాన్ ఈటర్

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పులుల సంచారం, కదలికలపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే రామగుండం, ములుగులో శిక్షణ ఇచ్చారు. పెద్దపులి ఫొటో దొరికితే.. రంగును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని తల్లి ఎవరు? వంటి సమగ్ర సమాచారం తెలుసుకునే వీలుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతున్నా.. పులుల జాడ తెలియటం లేదు. పాదముద్రలను సేకరిస్తూ.. బంధించేందుకు రెస్య్కూ, ఫ్లైయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. బెజ్జూరు, దహేగాం, పెంచికల్పేట్ మండలాల్లోని 52గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పులికి ఎరగా ఆవులను ఉంచుతున్నారు.

340 సీసీ కెమెరాలు, 60 మంది టైగర్ ట్రాకర్లతో పులి కదలికలపై నిఘా పెట్టారు. ఇటీవల గుండ్లపల్లిలోని ఏ2 టైగర్ కెమెరాలకు చిక్కింది. బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతం లో ఫారెస్ట్ అధికారులు ఎరవేసిన ఆవును పులి చంపేసింది. అది తిరిగి అక్కడికే వస్తుందనే భావించి రెస్య్కూ టీంలతో పాటు మత్తు మందు నిపుణులు, షూట ర్లను రంగంలోకి దింపారు.

మహారాష్ట్ర, తెలంగాణ ర్యాపిడ్ యాక్షన్ టీంలు.. మహారాష్ట్రకు చెందిన నిపుణులతో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కోర్ ఏరియాలోని గ్రామాలను తరలించేందుకు చర్యలు చేపట్టగా.. ముందుగా కడెం మండలం రాంపూర్, మైసంపేట, రెండో విడతలో అల్లీనగర్, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, దొంగపల్లి, మిద్దెచింత గ్రామాలను ఖాళీ చేయించాలి. ఆదివాసీలను అడవుల నుంచి బయటకు పంపేందుకే సర్కారు కుట్ర చేస్తోందని.. అందుకే పెద్దపులిని పట్టుకోవటం లేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed