మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తాం: సోనూ సూద్‌

by Jakkula Samataha |   ( Updated:2020-07-30 11:18:17.0  )
మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తాం: సోనూ సూద్‌
X

దిశ, వెబ్ డెస్క్: సోనూసూద్.. లాక్ డౌన్ సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. గత రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ రైతుకు ఎద్దులు లేక తన కూతుర్ల సహాయంతో సేద్యం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన సోనూసూద్ వారి ఇంటికి దిన మధ్యాహ్ననికి కల్లా ట్రాక్టర్ పంపించాడు. సోనూసూద్ ఉదారతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా సోనూసూద్ మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వలస కార్మికులకు ఆపన్నహస్తం అందించిన ఆయన తాజాగా నిరుద్యోగుల కోసం మూడు లక్షల ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ఇప్పటికే ‘ప్రవాసీ రోజ్‌గార్‌’ పేరుతో ఉద్యోగ పోర్టల్‌ను ప్రారంభించారు. దీంతో మూడు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ‘నా పుట్టినరోజు సందర్భంగా మరో చిన్న పని చేస్తున్నా. ప్రవాసీరోజ్‌గార్‌.కామ్‌ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి’ అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. ఏఈపీసీ, సీఐటీఐ, ట్రైడెంట్, క్వెస్‌కార్ప్‌, అమెజాన్‌, సొడెక్సో వంటి సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు.

Advertisement

Next Story