జగన్ పై నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
జగన్ పై నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జగన్ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ ప్రైవేట్ విద్యాసంస్థలపై తీసుకుంటున్న నిర్ణయాలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు ఈ విషయంలో జగన్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ, రాజకీయ జీవితంపైనా, జగన్ పాలనపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాం నుంచి పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ ప్రభుత్వంలో తిష్టవేసి కూర్చున్నారని అలాంటి వారు కొన్ని తప్పుడు సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. అలాంటి తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థల విధానం దెబ్బతిందని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఫలితంగా తన విద్యాసంస్థలకు కూడా అన్యాయం జరిగిందని అన్నారు. తన విద్యాసంస్థలకు న్యాయంగా నిర్ణయించాల్సిన ఫీజులు నిర్ణయించలేదని మోహన్ బాబు ఆరోపించారు. అయితే ఆ ఐఏఎస్ అధికారుల పేర్లు బయటపెట్టదలచుకోలేదని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.

జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తనకు బంధువులు అని మోహన్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. గతంలో తాను కూడా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు. అలాగే 2019 ఎన్నికల్లో తాను, తనయుడు విష్ణులు కూడా జగన్‌కు అండగా ప్రచారం నిర్వహించామని చెప్పుకొచ్చారు. జగన్‌ కష్టానికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతో తాము ఎన్నికల ప్రచారం నిర్వహించామే తప్ప వేరే ప్రయోజనం ఆశించి మాత్రం కాదని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల తనకు ప్రేమాభిమానాలు ఉంటూనే ఉంటాయని వెల్లడించారు.

ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుంది

సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని..ఇప్పటికీ ఆ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయని డైలాగ్ కింగ్ మోహన్‌బాబు స్పష్టం చేశారు. అయినప్పటికీ వాటన్నింటిని ధీటుగా ఎదుర్కొంటానని వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఎదురైన ఘటనలు చూస్తుంటే ఇలా కూడా ద్రోహం చేస్తారా అనేంతగా జరుగుతున్నాయన్నారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నే వ్యక్తులు ఉన్నారని మోహన్ బాబు కుంబబద్దలు కొట్టారు. తనను ఆర్థికంగా దెబ్బతీయగలరేమో కానీ..తన సినిమా జీవితాన్ని దెబ్బతీయడం మాత్రం ఆ పైవాడి వల్ల తప్పితే మరెవ్వరికీ సాధ్యం కాదని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాలకు దాదాపు గుడ్ బై

ఇకపై రాజకీయాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మోహన్‌బాబు వెల్లడించారు. మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పుకొచ్చారు. 99 శాతం రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని అన్నారు. అయితే ఆ ఒక్క శాతం ప్రధాని మోడీ కోసం అని వివరణ ఇచ్చారు. మోడీ తన కుటుంబాన్ని ఢిల్లీ ఆహ్వానించి..తమపట్ల ఎంతో ఆప్యాయత చూపించారని గుర్తు చేశారు. మోడీ కోసం ఒకవేళ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆ ఒక్క శాతం మాత్రం అవకాశం ఉందని మోహన్‌బాబు స్పష్టం చేశారు. మరోవైపు తన ప్రాణస్నేహితుడు రజనీకాంత్‌కు కూడా రాజకీయాల్లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చానని గుర్తు చేశారు. తన సలహాను రజనీకాంత్ అంగీకరించాడని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed