రౌడీల్లా మా కుటుంబంపై దాడి చేశారు.. నేరేళ్ల బాధితుడు హరీష్ ఆవేదన (వీడియో)

by Sridhar Babu |   ( Updated:2023-10-22 14:41:10.0  )
nerella victim Harish
X

దిశ, సిరిసిల్ల: ఐదేళ్ల క్రితం ఇసుక లారీల కాల్చివేతలో తమ ప్రమేయం లేకున్నా సిరిసిల్ల పోలీసులు తమపై అక్రమ కేసులు బనాయించారని నేరేళ్ల బాధితుడు కోల హరీష్ ఆరోపించారు. అనగారిన వర్గాన్ని ఎవరూ ఆదుకోరనే ఆలోచనతో తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, భవిష్యత్తులో తాము ఏ పనీ చేసుకోకుండా చేసారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని నిరసన రూపంలో తెలిపేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో తనను, తన కుటుంబ సభ్యులను నిర్బంధించడం పోలీసులకు సాధారణ విషయంగా మారిందని పేర్కొన్నారు.

శుక్రవారం సిరిసిల్లలో జరిగే రైతు మహాధర్నాకు హాజరయ్యేందుకు మంత్రి కేటీఆర్ వస్తున్నాడని తెలిసి తనకు న్యాయం చేయాలని కోరేందుకు ఇంటి వద్దనే ఉండి నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన క్రమంలో ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ విధి నిర్వహణ మరిచి రౌడీలా ప్రవర్తించాడని వాపోయాడు. అరెస్ట్ వారెంట్ లేకున్నా తన ఇంట్లోకి చొరబడి తనను, తన కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదేం నిర్బంధమని ప్రశ్నించిన తన తండ్రిని, అమ్మను, నానమ్మను ఎస్ఐ వెంకటేశ్వర్లు తోసేరని దీనితో తన నానమ్మ కింద పడిపోయి స్పృహ కోల్పోయినట్లు వివరించాడు.

తనపై దౌర్జన్యానికి పాల్పడిన ఎస్ఐ వెంకటేశ్వర్లుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తంగళ్ళపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే కనీసం ఆ ఫిర్యాదుకు రశీదు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదుకు రశీదు ఇవ్వని పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదాన్ని వాడటం సిగ్గు చేటన్నాడు. ప్రభుత్వ, పోలీసుల తప్పిదం లేకుంటే ఐదేళ్ల క్రితం నేరేళ్ల బాధితులను పరామర్శించడానికి వచ్చిన పాలకులు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి ఇస్తామని ఎందుకు నమ్మబలికారని ప్రశ్నించారు. అకారణంగా తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఐదేళ్లుగా పోలీసులు తమపై అన్యాయంగా కేసులు పెడుతూ, గృహ నిర్బంధం చేస్తూ తమని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా.. మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం సరికాదన్నారు.

అనగారిన వర్గాల ఆత్మరక్షణ కోసం అంబేద్కర్ ఇచ్చిన హక్కులు కేటీఆర్ ఇలాఖాలో అపహస్యం అవుతున్నాయని, దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా తనపై, తన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన ఎస్ఐ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హరీష్ హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు, సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవహార తీరుపై బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని హరీష్ వేడుకున్నాడు.

Advertisement

Next Story