అతివేగం వల్లే యాక్సిడెంట్ : ఎస్సై రామ్ చరణ్..

by Sumithra |   ( Updated:2021-09-11 00:48:47.0  )
అతివేగం వల్లే యాక్సిడెంట్ : ఎస్సై రామ్ చరణ్..
X

దిశ, నర్సంపేట : రెండేళ్ల కిందట ఓ సంస్థకు చెందిన వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు. ఆ సంస్థపై కేసు వేసి నేటికీ పోరాడుతున్నాడు. ఈ కేసు విషయంలో కోర్టులో వాదనలు శనివారం జరగనున్నాయి. ఇది జరగడానికి కొన్ని గంటల ముందే అతను మృత్యువాత పడిన సంఘటన నర్సంపేట పట్టణ శివారులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం సీతానాగారం గ్రామానికి చెందిన లెక్కల సురేష్ రెడ్డి (35) వృత్తిరీత్యా కర్ణాటకలో పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట కేఎన్ఆర్ సంస్థకి చెందిన ట్రక్కు ఢీ కొట్టడంతో సురేష్ తండ్రి జయపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనలో సంస్థపై కోర్టులో కేసు వేసి పోరాడుతున్నాడు.

ఇంటికి వస్తున్నా.. అన్నం వండమ్మ..

తండ్రి జయపాల్ రెడ్డి కేసు విషయంలో కోర్టుకు సమర్పించాల్సిన కొన్ని పత్రాల కోసం శుక్రవారం కర్ణాటక నుండి వరంగల్ కి బయలుదేరాడు. సాయంత్రం వరంగల్‌కి చేరుకున్న సురేష్, అక్కడ ఓ మిత్రుని దగ్గర నుండి బైక్ తీసుకొని సీతానాగారానికి బయలుదేరాడు. దాదాపుగా 10 గంటల సమయంలో ఇంటికి కాల్ చేసి అన్నం వండమ్మ వస్తున్నా అని మాట్లాడాడు. నర్సంపేట శివారులోని జాతీయ రహదారి 365 పై ప్రమాదానికి గురయ్యాడు.

రోడ్డు పక్కన ఉన్న చెట్టు మోడును బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిద్ర లేమి కారణంగానే ప్రమాదం జరగొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అతివేగం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామ్ చరణ్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. సురేష్ మృతితో సీతానాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed