న్యూ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్.. ‘త్రీ ఫింగర్ సెల్యూట్’

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-12 03:58:41.0  )
న్యూ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్.. ‘త్రీ ఫింగర్ సెల్యూట్’
X

దిశ, ఫీచర్స్: ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం కైవసం చేసుకున్న మయన్మార్‌ సైన్యానికి వ్యతిరేకంగా.. ఫిబ్రవరి 1 నుంచి మయన్మార్‌లో ప్రజాందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజలు వేలాది సంఖ్యలో సైన్యానికి వ్యతిరేకంగా రోడ్డెక్కడంతో, మయన్మార్‌లోని ప్రధాన నగరాలన్నీ ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. నిర్బంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీతో పాటు నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో ఓ చిహ్నం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘త్రీ ఫింగర్ సెల్యూట్’. గత ఏడాది అక్టోబర్‌లో పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోని ‘మహా వజీరాలోంగ్‌కార్న్’ రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లోనూ ఈ సింబల్ కనిపించింది. ఆ సంజ్ఞకు అర్థమేమిటి? ఎందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు?

అమెరికాకు చెందిన టెలివిజన్ రైటర్, ఆథర్ సుజాన్ కాలిన్స్ రాసిన ఉత్తమ రచనల్లో ‘ది హంగర్ గేమ్స్’ సిరీస్ ఒకటి. ఈ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ‘త్రీ ఫింగర్ సెల్యూట్’ సింబల్ తొలిసారిగా తెరపైకి వచ్చింది. డిస్టోపియన్ ప్రపంచంలో స్నో అనే అధ్యక్షుడి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అణగారిన ప్రజల ప్రతిఘటనకు రూపమే ఈ గుర్తు. కాట్నిస్ ఎవర్‌డీన్ అనే పాత్ర ద్వారా ఈ గుర్తు ప్రాచుర్యం పొందగా, ఆ పాత్రను జెన్నిఫర్ లారెన్స్ పోషించారు. త్వరిత కాలంలోనే ప్రజాతిరుగుబాటుకు, ప్రతిఘటనకు అది చిహ్నంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తొలిసారిగా ‘మెడికల్ వర్కర్స్’ తమ నిరసనలో భాగంగా ‘త్రీ ఫింగర్ సెల్యూట్’ను ఉపయోగించారు. ఆ తర్వాత థాయిలాండ్‌లోని యువకులు ఒక షాపింగ్ మాల్ ముందు సమావేశమై, ఆ సంవత్సరం జరిగిన సైనిక స్వాధీనంపై తమ వ్యతిరేకతను సూచించడానికి, కార్యకర్తలలో ఒకరు మూడు వేళ్ల సెల్యూట్‌‌ చేయగా, ర్యాలీలో భాగమైన ఇతరులు దాన్ని అనుసరించారు. ఇలా నిశ్శబ్ద నిరసనకు కొత్త రూపంగా ‘త్రీ ఫింగర్ సెల్యూట్’ దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఇది మరిన్ని ర్యాలీల్లోనూ కనిపించింది.

థాయ్ మిలిటరీ ఆ సెల్యూట్‌పై నిషేధం విధించగా, 2014లో జరిగిన హాంకాంగ్ అంబ్రెల్లా రివల్యూషన్‌లో, ఆ తర్వాత జరిగిన ఎన్నో నిరసనల్లోనూ ప్రజలు ఈ సెల్యూట్‌ను ప్రదర్శించారు. 2010 నుండి ప్రజాస్వామ్య సంస్కరణలు ప్రారంభమైన మయన్మార్‌లో ఇంటర్నెట్ ప్రజలకు వేగంగా చేరువైంది. యువతతో పాటు దేశంలోని కొత్తతరం.. ప్రపంచమంతటా పాపులర్ అవుతున్న ఈ కల్చర్‌ను ఫాలో అవడం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పాపులరైన మీమ్స్, సింబల్స్‌ను నిరసనల్లో ఉపయోగించడం పెరిగింది. ఈ క్రమంలోనే యువ బర్మీస్ నిరసనకారులు ‘పెపే ది ఫ్రాగ్’ను తమ నిరసనల్లో ప్రదర్శించగా, హాంగ్‌కాంగ్‌లో ప్రొ డెమోక్రసి ప్రొటెస్ట్‌లో భాగంగా డోగే, చీమ్స్ సింబల్స్‌ను వినియోగించారు. ప్రస్తుతం మయన్మార్‌లోని మాండలేలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో నిరసనకారులంతా ప్లకార్డులతో పాటు ‘త్రి ఫింగర్ సెల్యూట్’ చూపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. త్రి ఫింగర్ సెల్యూట్ ప్రతిఘటనకు చిహ్నం.

Advertisement

Next Story