కాంగ్రెస్‌.. రాహులో రాహులా?

by Shyam |   ( Updated:2020-02-13 04:37:07.0  )
కాంగ్రెస్‌.. రాహులో రాహులా?
X

గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూ ఉంది. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం తెలిసిందే. అంతేకాకుండా గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సూచించారు. కానీ, వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు అయిష్టంగానే సోనియా గాంధీనే మళ్లీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అయితే ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సోనియాగాంధీనే శాశ్వత అధ్యక్షురాలిగా కొనసాగుతారా.. లేదా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా అనేది ప్లీనరీ సమావేశాల్లో తేలనుంది. కాగా రాహుల్‌గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా అన్న విషయంలోనూ స్పష్టత లేదు. ఇప్పటివరకైతే అందుకు సంబంధించి రాహుల్‌‌గాంధీకి ఎటువంటి పిలుపు రాలేదని సన్నిహితవర్గాల సమాచారం.

134 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ గాంధీ కుటుంబానికి చెందినవారే అధ్యక్షులుగా కొనసాగేవారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత కొన్ని సంవత్సరాలు మాత్రమే గాంధీయేతర కుటుంబాలకు చెందిన ‘సీతారాం కేసరి’, పీవీ నరసింహారావు అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత పలువురు నాయకుల ప్రోద్బలంతో 1998లో సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 19 ఏండ్ల నుంచి జాతీయ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. కానీ ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీకి క్రియాశీలక అధ్యక్షుడి అవసరం ఏర్పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇది అత్యవసరం కూడా. వరుసగా మూడు దఫాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అదీగాక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్క సీటును గెలుచుకోకపోగా 63 స్థానాల్లో డిపాజిట్ గల్లంతవడంతో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పార్టీ యువనాయకత్వం నుంచి నిరసనలు మిన్నంటుతున్నాయి. అయితే రాహుల్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా లేదా గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడిని ఎన్నుకుంటారా తెలియాలంటే ఏప్రిల్ వరకు వేచిచూడాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed