- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LRS కు ‘ఆధార్’ తప్పనిసరి..
దిశ, న్యూస్ బ్యూరో: అమెరికాలోని డల్లాస్‌లో ఉండే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు ఉండే తెలంగాణలోని కాప్రా మండలం నాగారం గ్రామంలో 200 చదరపు గజాలు ఉన్న నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశారు. గత 14 ఏళ్లుగా డల్లాస్‌లోనే ఉంటున్నారు. మరో 6 సంవత్సరాలకు తిరిగి ఇక్కడికే వచ్చి స్థిరపడిపోవాలనేది ఆయన నిర్ణయం. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్‌ను చూసి ఓ వైపు ఒత్తిడి, మరోవైపు చట్టబద్ధత వస్తుందనే యోచనలో ఉన్నారు.
మంగళవారం ఎల్ఆర్ఎస్ వెబ్‌సైట్‌లో తన దరఖాస్తులను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలుపుతున్నది. దీంతో అతడు నేరుగా తనకు పరిచయమున్న ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించగా ఆధార్ కార్డు తప్పని సరియని వారు వెల్లడించారు. అది విన్న శ్రీనివాస్ అవాక్కయ్యారు. నాలుగు ప్లాట్లు ఇక ఎందుకు పనికిరావా ? అని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
అలాగే మల్కాజిగిరికి చెందిన వెంకన్న యాదగిరిగుట్టలో 10 ప్లాట్లు కొనుగోలు చేశారు. అందులో కొన్ని ప్లాట్లను తన కూతురి పేరుమీద ఖరీదు చేశారు. అయితే కూతురుకు ఆధార్ కార్డు లేదు. అప్పట్లో పాన్ కార్డును జతపరిచి రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఉంటున్నది. ఇప్పుడు ఆ ప్లాట్ల పరిస్థితి ఏమిటి? ఎల్ఆర్ఎస్ చేసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో వెంకన్న ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో ఆధార్ కార్డు నమోదు చేయడంతో ఆ వ్యక్తికి ఎన్ని ప్లాట్లున్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే పూర్తి సమాచారం అధికారుల వద్దకు చేరుతుంది. ఈ వ్యక్తిగత వివరాలు అధికారుల వద్దకు చేరుతాయి. దీంతో అధికారులు ఎప్పుడైనా? ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదనే ఆందోళన పలువురిలో మొదలైంది.
కొంప ముంచుతున్న కొత్త నిబంధన..
ఎల్ఆర్ఎస్ వర్తించాలంటే ప్రతీ దరఖాస్తుదారుడు ఆధార్‌కార్డును కలిగి ఉండాలని వెబ్‌సైట్‌లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఎల్ఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలంటూనే కొత్త నియమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గత ఎల్ఆర్ఎస్‌లో ఈ నిబంధన లేదు. కానీ, ప్రస్తుత ఎల్ఆర్ఎస్‌లో విధించడంతో ప్లాట్ల యజమానులు ఆందోళనలకు గురవుతున్నారు.
ప్లాట్లు ఉండి ఆధార్‌కార్డు లేకుంటే ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేవు. దీంతో విదేశాల్లో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. కొత్త నిబంధన కొంప ముంచుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనను వెంటనే తొలగించాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.