బ్యూటీఫుల్‌గా ఉండటం ఎలా?

by vinod kumar |
బ్యూటీఫుల్‌గా ఉండటం ఎలా?
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలు, అబ్బాయిలనే కాకుండా.. మనలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అందానికి తెగ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే నిజమైన అందం ఎక్కడ ఉంటుంది? అందంగా కనిపించడానికి సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే.. లేవుగానీ అందంగా కనిపించేందుకు మాత్రం ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. అందులో ఒక కోణాన్ని తెలిపే కథే ఇది..

ఓ పాఠశాలలో ఇంగ్లిష్ బోధించే టీచర్ ఒకరు ఏడో తరగతి విద్యార్థుల క్లాస్‌కెళ్లి బోర్డుపై ‘ఐ యామ్ బ్యూటీఫుల్’ అని రాసింది. ఆ తర్వాత ఇది ఏ టెన్స్‌లో ఉందంటూ ఓ విద్యార్థిని ప్రశ్నించింది. వెంటనే పాస్ట్ టెన్స్ మేడమ్ అనే సమాధానమొచ్చింది. అయితే ఆ విద్యార్థి ఇచ్చిన సమాధానాన్ని పక్కనబెడితే అందులోనూ ఓ వాస్తవం దాగుంది. ఎక్స్‌టర్నల్ బ్యూటీ.. సమయం గడిచేకొద్దీ గతం(పాస్ట్ టెన్స్)లోకి వెళ్లిపోతుంది. అదే ఇంటర్నల్ బ్యూటీ సమయం గడిచేకొద్దీ అంతకంతకూ బ్యూటీని పెంచుకుంటూ పోతుంది.

అనగనగా ఓ ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇంటర్నెట్, న్యూస్ పేపర్ల వంటి సదుపాయాలేవీ లేని మారుమూల గ్రామం అది. కానీ ఆ వ్యక్తి.. రాష్ర్టపతి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాడు. దాంతో రాష్ర్టపతిపై అమితమైన ఇష్టం ఏర్పడింది. ఒకానొక రోజు రామయ్యకు.. వాళ్ల ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణానికి రాష్ర్టపతి వస్తున్నాడనే వార్త తెలిసింది. రాష్ర్టపతి గురించి ఎవరో చెబితే వినడం తప్ప.. రామయ్య అప్పటివరకు ఆయన్ను చూసింది లేదు. కేవలం అక్కడక్కడా విన్న సమాచారంతోనే అతనికి రాష్ర్టపతిపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అయితే రామయ్య ఉన్న ఊరికి అంతగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేనప్పటికీ ఎలాగైనా రాష్ట్రపతిని చూడాలని ఎలాగో అలా రెండు, మూడు బస్సులు మారి అక్కడికెళ్లాడు. రామయ్య లాగానే ఎంతోమంది జనాలు రాష్ట్రపతిని చూడటానికి వచ్చారు. ఆ గుంపులో ఎక్కడో దూరంగా నిలుచున్నాడు.

రాష్ర్టపతి ఎలా ఉన్నాడంటే?

రాము.. తన ఊహల్లో రాష్ర్టపతి అందంగా, మంచి హైట్‌తో గంభీరంగా ఉంటాడని ఊహించుకున్నాడు. ఉండబట్టలేక.. తన పక్కనున్న సిటీ వ్యక్తిని మీరు రాష్ర్టపతిని చూశారా? చూడ్డానికి ఎలా ఉంటాడు? అని అడిగాడు. హా చూశాను, చాలా యావరేజ్‌గా ఉంటాడు.. ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అని అవతలి వ్యక్తి బదులిచ్చాడు. అంతలోనే.. జనాల మధ్య నుంచి రాష్ర్టపతిని చూస్తే వాస్తవానికి అలానే అనిపించింది. కానీ రాష్ట్రపతి వస్తూనే.. ఆ గుంపులో ఉన్న రామయ్యకు షేక్ హ్యండ్ ఇచ్చాడు. ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా ? అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. ఆ పలకరింపుతో ‘ఎవరు చెప్పారు మన రాష్ర్టపతి అందంగా లేడని ? అతడిని మించిన అందగాడిని నేను ఇంతవరకు చూడలేదు’ అని రామయ్య తన మనసులోనే అనుకున్నాడు. ఇక్కడ రామయ్య అప్పటివరకు ఊహించుకున్న రాష్ర్టపతి సౌందర్యం వేరు.. అతని కళ్లముందు కనిపించిన రూపం వేరు. కానీ, రాష్ర్టపతి పలకరించిన తీరు, ఆయన చూపించిన ఆత్మీయత, సభలో ఆయన మాట్లాడిన మాటలు.. బాహ్య సౌందర్యాన్ని కనిపించకుండా చేశాయి. దాంతో రామయ్యకు రాష్ర్టపతి ఆత్మసౌందర్యం మాత్రమే కనిపించింది. మన మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం కూడా ఇదే చెప్పారు. ‘నేను అందంగా లేను కానీ.. సాయం అడిగిన వారికి నేను చేయందిస్తాను. సౌందర్యం హృదయంలో ఉంటుంది.. ముఖంలో కాదు’ అని.

అందంగా, సౌందర్యవంతులుగా ఉండాలనుకుంటున్నారా? అయితే.. సాయమందించడానికి మీ చేయి అందించండి. హ్యాండ్సమ్ కావాలనుకుంటే.. హ్యాండ్ టూ సమ్ అని గుర్తుపెట్టుకోండి. సాయం అందిస్తే.. ఆత్మ సౌందర్యం ఎప్పటికీ పాస్ట్ టెన్స్‌గా మారదు. వయసుతో సంబంధం లేకుండా.. చిరకాలం మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

Advertisement

Next Story