ఆత్మహత్య చేసుకున్న నిండు చూలాలు.. సొంత అన్ననే అలా అనేసరికి

by Mahesh |   ( Updated:2021-08-02 02:28:47.0  )
ఆత్మహత్య చేసుకున్న నిండు చూలాలు.. సొంత అన్ననే  అలా అనేసరికి
X

దిశ, వెబ్‌డెస్క్: క్షణికావేశంతో ఒక గర్భవతి ప్రాణాలను తీసుకుంది. అన్న తిట్టాడన్న మనస్థాపంతో కడుపులో బిడ్డ ఉందన్న విషయాన్నీ కూడా మరిచి తనువు చాలించింది. మరికొద్ది రోజుల్లో తనకు పాప పుడుతోందని కలలు కన్న ఆ తండ్రికి విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మెరైన్‌ కానిస్టేబుల్‌ గొరిపర్తి పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) 15 నెలల క్రితం హైదరాబాద్‌లో చార్డెడ్‌ అకౌంటెంట్‌గా పని చేసే నెరుసు సాయి శంకర్‌తో వివాహమైంది.

ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భవతి. నెలలు నిండుతుండడంతో ఆమె పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇంటికి వచ్చిన చెల్లి నాగభార్గవితో అన్న నిఖిల్‌ ఎప్పుడూ గొడవపడుతుండేవాడు. ఆమెతో పాటు తల్లిని కూడా దూషిస్తూ.. వాదనకు దిగుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే అన్నాచెల్లెలి మధ్య ఆదివారం వాదన జరిగింది. ఆ గొడవలో నిఖిల్.. చెల్లి నాగ భార్గవిని ఇష్టంవచ్చినట్లు తిట్టి ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయట ఉన్న తల్లి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నిండు చూలాలైన కుమార్తె నాగభార్గవి ఉరికి వేలాడుతూ కనిపించడంతో హతాశురాలైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఆమె కన్నుమూసింది. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.సందీప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story