గుజరాత్‌ కొవిడ్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. 16 మంది పేషెంట్లు మృతి

by Shamantha N |
గుజరాత్‌ కొవిడ్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. 16 మంది పేషెంట్లు మృతి
X

అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ కొవిడ్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం 16 మంది కరోనా పేషెంట్లతోపాటు ఇద్దరు నర్సులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి(శనివారం తెల్లవారుజాము) సుమారు ఒంటిగంట ప్రాంతంలో బరూచ్ జిల్లాలోని వెల్ఫేర్ హాస్పిటల్‌ ఐసీయూలో ఈ ఘటన సంభవించింది. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ చేరుకున్నారు. అరగంటలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికులు వేగంగా స్పందించి ఐసీయూ అద్దాలు బద్దలుకొట్టి పేషెంట్లను కాపాడారు. ఘటనా సమయానికి నాలుగు అంతస్తుల ఈ హాస్పిటల్‌లో సుమారు 70 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.

దాదాపు 27 మంది ఐసీయూలో ఉన్నారు. కొందరు వెంటిలేటర్ల సపోర్టుతో ఉన్నారు. ఘటనాస్థలికి స్థానికులు వెంటనే పరిగెత్తుకువచ్చి ఐసీయూ అద్దాలు బద్దలు కొట్టి పేషెంట్లను రక్షించారు. ఈ ప్రమాదంలో 16 మంది పేషెంట్లు, ఇద్దరు నర్సులు మరణించారని బరూచ్ ఎస్పీ రాజేంద్రసిన్హా చూడాసమా తెలిపారు. మిగతా వారిని సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయివుండొచ్చని అగ్నిమాపక అధికారులు అభిప్రాయపడ్డారు. ఘటనపై న్యాయవిచారణకు సీఎం విజయ్ రూపానీ ఇద్దరు సీనియర్ అధికారులను నియమించారు. మృతులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. వెల్ఫేర్ హాస్పిటల్‌ను ఓ ట్రస్టు నిర్వహిస్తు్న్నది.

Advertisement

Next Story

Most Viewed