కేర్ ఆస్పత్రిపై రోగి బంధువులు దాడి

by Shyam |

దిశ, క్రైమ్ బ్యూరో: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కొవిడ్-19 పేషెంట్ బంధువులు దాడికి పాల్పడిన సంఘటనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పంజాగుట్ట ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. కేర్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌కు సరైన సౌకర్యం కల్పించలేదంటూ హైదరాబాద్ తలాబ్‌కట్టకు చెందిన రోగి బంధువులు, హైదరాబాద్ యూత్ కరేజ్ ఛానల్‌కు చెందిన రిపోర్టర్ సల్మాన్ ఖాన్, అమ్జద్, మెహబూబ్ ఖాన్ (రోగి భర్త), మరో ముగ్గురు ఆస్పత్రి ఎమర్జెన్సీ వద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశారని, ఆస్పత్రి ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించారని ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో ఎమర్జెన్సీ వార్డు వద్ద గందరగోళం సృష్టించారని, సిబ్బందిపై బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరిపై మెడికల్ సర్వీస్ పర్సన్స్ అండ్ మెడికల్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ -2008, ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్-1897 సెక్షన్ 3, సెక్షన్ 51 (బి), విపత్తు నిర్వహణ చట్టం 2005, ఐపీసీ 34 ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు

Advertisement

Next Story

Most Viewed