ఈటల క్యాంప్ ఆఫీసులో కరపత్రాల కలకలం

by Anukaran |   ( Updated:2021-05-04 06:38:18.0  )
ఈటల క్యాంప్ ఆఫీసులో కరపత్రాల కలకలం
X

దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ప్రింట్ చేసిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు.

సీబీఐ విచారణ చేపట్టాలి..

ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డిల ఇళ్లపై ఐటీ దాడులు చేయాలని ఆ కరపత్రాల్లో డిమాండ్ చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఓ మెడికల్ కాలేజీలో 75 శాతం వాటా, మరో కాలేజీలో 50 శాతం వాటా ఉందని, హుజురాబాద్ లో ఒక్క డబుల్ బెడ్రూం కట్టించిన ఈటలకు.. ఢిల్లీలో ఓ భవనం, వందల ఎకరాల్లో భూములు, రూ. కోట్లు విలువ చేసే ఫాం హౌజ్ ఉన్నాయని ఈ కరపత్రాల్లో పేర్కొన్నారు.

19 డిమాండ్లతో కూడిన కరపత్రాలను తిప్పారపు సంపత్ పేరిట ముద్రించి ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఈటలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిప్పారపు సంపత్ టవర్ ఎక్కారు. సోమవారం ఈటల పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరిట కరపత్రాలు వెలువడడం స్థానికంగా చర్చకు దారి తీసింది.

Letter

Advertisement

Next Story

Most Viewed