తాళిబొట్ల తాకట్టు నుంచి విముక్తి.. రూ.25లక్షల బీమా అందిస్తాం: రాహుల్ గాంధీ

by Swamyn |
తాళిబొట్ల తాకట్టు నుంచి విముక్తి.. రూ.25లక్షల బీమా అందిస్తాం: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.25లక్షల నగదు రహిత బీమాను వర్తింపజేస్తామని, తద్వారా వైద్యఖర్చుల కోసం మహిళలు తమ తాళిబొట్లను తాకట్టుపెట్టాల్సిన అవసరం ఉండబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. విపక్షాలను గెలిపిస్తే ప్రజల సొమ్మును చొరబాటుదారులకు దోచిపెడతారంటూ ప్రధాని మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాహుల్ పై విధంగా కౌంటర్‌ ఇచ్చాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రాహుల్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రాజ్యమేలుతున్న భారతదేశంలో కేవలం వైద్య ఖర్చుల వల్లనే ఏటా 6కోట్ల మంది ప్రజలు పేదరికపు అగాధంలోకి కూరుకుపోతున్నారు. ఖరీదైన చికిత్స, ఖర్చుతో కూడుకున్న టెస్టులు, ఖరీదైన మందులతో సామాన్యుడు అప్పులు, వాటి వడ్డీల చక్రంలో చిక్కుకుపోతున్నాడు. వాటి నుంచి బయటపడేందుకు ఏళ్లుగా శ్రమిస్తున్నాడు. అయితే, మేము అందించబోయే రూ.25లక్షల వరకు ఉచిత బీమా.. ఈ అప్పుల చక్రం నుంచి విముక్తి కల్పిస్తుంది. కాబట్టి, ఇకపై భారతదేశంలోని ఏ ఒక్క మహిళ కూడా తన కుటుంబ చికిత్స కోసం తన ‘మంగళసూత్రాన్ని’ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు’’ అని తెలిపారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే కులగణన, ఆర్థిక సర్వే చేపడతామని చెప్పారు. ‘‘దేశ జనాభాలో 90శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. కానీ, కార్పొరేట్, మీడియా సెక్టార్లు, ప్రైవేట్ హాస్పిటళ్లు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వంలో బ్యూరోకాట్‌లలో వారి ప్రాతినిధ్యం మాత్రం ఉండదు. అందుకే, అధికారంలోకి రాగానే తొలుత కులగణన, ఆర్థిక సర్వే చేపడతాం’’ అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, రిజర్వేషన్లు, రాజ్యాంగం, పేదల హక్కుల పరిరక్షణకే ఈ లోక్‌సభ ఎన్నికలని రాహుల్ తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed