MP అభ్యర్థుల అవగాహన లేని రాజకీయం.. తీవ్ర నిరాశలో కేడర్

by GSrikanth |
MP అభ్యర్థుల అవగాహన లేని రాజకీయం.. తీవ్ర నిరాశలో కేడర్
X

దిశ, చార్మినార్: లోక్‌సభ ఎన్నికలను జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్‌‌పై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థుల పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులు వచ్చి విస్తృతంగా ప్రచారం చేసినా బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్లు తెలుస్తోంది. పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు కనీసం లోకల్‌గా ఉన్న కేడర్‌ను కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీ తత్వం లేని నాయకులకు టికెట్ ఇచ్చి పార్టీల పేరు చెడ గొడుతున్నారని పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నారు. అసలు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి నామ్ కే వాస్తేగా పోటీచేసే కంటే అభ్యర్థులను నిలబెట్టకుంటేనే పార్టీల పరువు పెరుగుతుందని పార్టీ శ్రేణులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ టికెట్ కోసం ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేశారు. టికెట్ ఇస్తే పార్టీని బట్టి కోట్లు ఖర్చు బెట్టి గెలుస్తానని పార్టీ కార్యాలయ చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. అంతేగాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం టికెట్‌ల కోసం ఎంఐఎం పార్టీ చుట్టూ కూడా తిరిగారు. మేము ఎంత టికెట్ అడిగినా కాదని మీరు ఒక్కసారి చెబితే టికెట్ కన్ఫర్మ్ అని ఎంఐఎం చీఫ్‌తో కూడా తమ పార్టీలకు చెప్పించుకున్నారన్నా విమర్శలూ లేక పోలేవు. ఎట్టకేలకు టికెట్‌లు సంపాదించిన అభ్యర్థులు సొంత పార్టీ నుంచి ఫండ్ ఎంత వస్తుంది? ప్రత్యర్థులు ఎంత ఇస్తారు? అని లెక్కలు వేసుకున్నారు. ప్రస్తుత ఎంపీ అభ్యర్థిని కలవడానికి 20 రోజుల నుంచి తిరుగుతున్న సొంత పార్టీ కేడర్‌కు కూడా సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేక లేక అభ్యర్థులు కలిసినా వారి నుంచి సరైన స్పందన లభించడం లేదని ఆరోపిస్తున్నారు. సదరు నియోజకవర్గాల నుంచి వచ్చిన కింది స్థాయి కేడర్‌తో మాత్రం పార్టీ నుంచి ఫండ్ రాలేదు.. వచ్చాక చూద్దాం లే? అని ఎంపీ అభ్యర్థులు పొమ్మనక పొగపెడుతున్నారు.

చివరికి పార్టీ ఫండ్ వచ్చినా కింది స్థాయి కేడర్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. నా ఇన్నేళ్ల కష్టానికి ఫలితమే పార్టీ ఫండ్ అని అభ్యర్థులు బహిరంగంగానే చెప్పుకోవడం గమనార్హం. మరి కొందరికి మాత్రం తప్పని పరిస్థితుల్లో ఐదు, పది ఇచ్చి చేతులుదులుపుకుంటున్నారు. సొంత పార్టీ ఫండ్‌తో పాటు ఎంఐఎం పార్టీ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆశిస్తున్నారు. హిందువుల ఓట్లు బాగా చీలుస్తామని, ముస్లింలు నివసించే బూత్‌లలో సైతం ఎవరిని పెట్టమనే ఒప్పందాలు సైతం కుదుర్చుకుంటున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కనీస పోటీకూడా ఇవ్వని అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా హైదరాబాద్ రాజకీయాలు మారావనే రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు. అభ్యర్థులు చేసే తుగ్లక్ రాజకీయాలకు పార్టీలకు పట్టుకొమ్మలుగా ఉండే కింది స్థాయి కేడర్ సైతం పార్టీలను వీడే అవకాశాలు లేకపోలేవు.

Advertisement

Next Story