కాంగ్రెస్ ఒక పిరికిపంద.. నాకు కనీసం సైకిల్ కూడా లేదు: ప్రధాని మోడీ

by Swamyn |
కాంగ్రెస్ ఒక పిరికిపంద.. నాకు కనీసం సైకిల్ కూడా లేదు: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ఆ పార్టీపై విమర్శల డోసును పెంచుతున్నారే తప్ప ఏమాత్రం తగ్గించడం లేదు. ఈ క్రమంలోనే శనివారం జార్ఖండ్‌లోని పాలము ర్యాలీలో పాల్గొన్న మోడీ.. ప్రతిపక్ష పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ ఒక ‘పిరికిపంద’లా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో దేశంలో ఉగ్రదాడులు జరిగితే, ఏమీ చేయలేక ప్రపంచ వేదికలపై ఏడ్చిందని తెలిపారు. కానీ, బీజేపీ హయాంలో ఆ పరిస్థితులు మారిపోయాయని, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థానే ఇప్పుడు సాయం కోసం ఆర్తనాదాలు పెడుతోందని వెల్లడించారు. యూపీఏ పాలనను ఉద్దేశిస్తూ, ఇరు దేశాల మధ్య శాంతి కోసం గత ప్రభుత్వాలు పాక్‌కు ‘లవ్ లెటర్లు’ పంపాయని, అయితే, వాటికి స్పందనగా పాక్ మాత్రం మరింత మంది ఉగ్రవాదులను దేశంలోకి పంపించేదని అన్నారు. ‘‘కానీ, నేటి భారతం పత్రాలు ఇవ్వదు. ఇది నవ భారతం. ఇంట్లోకి చొరబడి మరి చంపేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జార్ఖండ్, బిహార్ నుంచి దేశ రక్షణ కోసం వెళ్లిన ఎందరో సరిహద్దుల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

రాహుల్ కోసం పాక్ ప్రార్థనలు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్‌లోని అప్పటి మంత్రి ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీ ప్రసంగం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘రాహుల్ ఆన్ ఫైర్’’ అంటూ ఇటీవలే పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని ప్రధాని మోడీ ప్రస్థావిస్తూ, ‘‘బీజేపీ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌తో అల్లాడిపోయిన పాక్ లీడర్లు.. ఇప్పుడు యువరాజు(రాహుల్‌ను ఉద్దేశించి) భారత తదుపరి ప్రధాని కావాలని ప్రార్థనలు చేస్తున్నారు’’ అని తెలిపారు. అయితే, శక్తివంతమైన భారత్‌కు బలమైన ప్రభుత్వం అవసరమని, అందుకే బీజేపీని గెలిపించాలని కోరారు.

కనీసం సైకిల్ కూడా లేదు

జార్ఖండ్‌లోని అధికార కూటమిపై మోడీ స్పందిస్తూ, అవినీతి జేఎంఎం, కాంగ్రెస్ నాయకులు తమ పిల్లల కోసం భారీగా అక్రమ సంపదను కూడబెట్టారని ఆరోపించారు. అయితే, అలాంటి వారందరిపై వచ్చే ఐదేళ్లలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ఇండియా కూటమి నాయకులు, పీకల్లోతు అవినీతిలో మునిగిపోయారు. ఢిల్లీ, రాంచీలలో అవినీతిపరులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తారు. ఇది వారి నిజమైన స్వభావాన్ని తెలియజేస్తుంది’’ అని అన్నారు. ‘‘గత 25ఏళ్లలో సీఎం, ప్రధాని పదవులను చేపట్టినప్పటికీ, నాకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. కనీసం సైకిల్ కూడా లేదు’’ అని మోడీ తెలిపారు.



Advertisement

Next Story