‘తొలి దశ’కు నేటితో ముగియనున్న నామినేషన్లు

by Swamyn |
‘తొలి దశ’కు నేటితో ముగియనున్న నామినేషన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ బుధవారంతో ముగియనుంది. తొలి దశలో భాగంగా వచ్చే నెల 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ.. ఈ నెల 20నే ప్రారంభమైంది. బుధవారంతో ముగియనుంది. గురువారం నామినేషన్ల పరిశీలన ఉండనుండగా, 30న(శనివారం) నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. బిహార్‌లోని నాలుగు స్థానాలకూ తొలి దశ ఎన్నికల్లో భాగంగానే పోలింగ్ జరగనుండగా, ఇక్కడ మాత్రం 28వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 30న పరిశీలన, వచ్చే నెల 2న ఉపసంహరణ గడువు ముగియనుంది.

తమిళనాడులో సింగిల్ ఫేజ్..

వచ్చే నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌కు నిర్వహించనున్నారు. దీంతో ఈ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. తమిళనాడు తర్వాత రాజస్థాన్‌లో అత్యధికంగా 12 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇక దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశలో భాగంగా 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటు మధ్యప్రదేశ్‌లో 6 స్థానాలు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోని చెరో 5 స్థానాలు, బిహార్‌లో 4, బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి నియోజకవర్గాలు, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఒక్కో లోక్‌సభ స్థానంలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.


Advertisement

Next Story