బీఆర్ఎస్‌ లీడర్లలో గుబులు.. ఇంకెంత డ్యామేజ్ అవుతుందోనన్న ఆందోళన

by GSrikanth |
బీఆర్ఎస్‌ లీడర్లలో గుబులు.. ఇంకెంత డ్యామేజ్ అవుతుందోనన్న ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐదేండ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సీట్లను గెల్చుకున్న బీఆర్ఎస్‌లో ఈసారి ధీమా కొరవడింది. ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలకంటే ఓటింగ్ షేర్ ఎంత పతనం అవుతుందోననే గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా కాంగ్రెస్‌తో పోలిస్తే 1.8శాతం మాత్రమే వెనకబడి ఉన్నామని తనకు తాను సర్దిచెప్పుకుంటున్నది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి ఆశాజనకమైన పరిస్థితులు లేకపోవడంతో పార్టీ మనుగడపైనే ఆ పార్టీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంతకాలం బీఆర్ఎస్‌లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తుండడంతో వారికి స్థానికంగా ఉన్న శ్రేణులు, కార్యకర్తలు కూడా అటువైపు వెళ్ళిపోవడంతో ఈ ఎఫెక్టు గణనీయంగా ఉంటుందనే ఆందోళన కనిపిస్తున్నది. ఓట్ల చీలిక భారీగా ఉండొచ్చని, పార్టీలో సంక్షోభం మరింత ముదరొచ్చనే అంచనాలున్నాయి.

ఒక్కరొక్కరుగా ఇతర పార్టీల్లోకి..

గడచిన రెండు నెలల వ్యవధిలోనే పది మంది సీనియర్ లీడర్లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోయారు. ఆ పార్టీ తరఫునే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇంతకాలం వారు ఆ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ మారడంతోనే వారి వెంట బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్ళడంతో ఊహించని క్రైసిస్ తలెత్తింది. వారిమీద నమ్మకంతో పార్టీ బాధ్యతలన్నీ ఇంతకాలం వారికే అప్పజెప్తే తీరా లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ మారిపోవడంతో కేడర్‌ను కూడా నిలుపుకోలేని నిస్సహాయ స్థితి నెలకొన్నదనే అభిప్రాయం ఆ పార్టీ లీడర్లలో వ్యక్తమవుతున్నది. ఓడిపోయినా కనీసం గౌరవప్రదమైన స్థాయిలోనైనా ఓట్లు పొందగలుగుతామా అనే అనుమానాలున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టినా అవి ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్నదీ అంచనాకు అందడంలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య, దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరిపోయారు. చివరి ముగ్గురూ ఆ పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పోతుగంటి రాములు, ఆయన కుమారుడు, బీబీ పాటిల్, గోడం నగేశ్, సైదిరెడ్డి, ఆరూరి రమేశ్, సీతారాంనాయక్ తదితరులు బీజేపీలో చేరారు. చివరి ఐదుగురూ బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఈసారి బీజేపీ తరఫున భువనగిరి నుంచి బరిలో ఉన్నారు. ఐదేండ్ల కాలంలో చూస్తే దాదాపు డజను మందికి పైగానే బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ పార్టీల తరఫున అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఇక ఈటల రాజేందర్ సైతం బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు.

సిట్టింగ్ స్థానాల్లో ఉనికి ప్రశ్నార్థకమే..

ఊహకు అందని తీరులో వీరు వెళ్లిపోవడంతో అనివార్యంగా కొత్త లీడర్లను అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిలో పలువురు రాజకీయంగా సీనియర్లు కావడంతో వారితో పాటు స్థానిక లీడర్లు, కేడర్‌ కూడా వెళ్లిపోయింది. దీంతో వారి ద్వారా పడే ఓట్లకు గండి పడినట్లయింది. చాలా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా లేదా అనే చర్చలు జోరుగానే సాగుతున్నాయి. రెండు మూడు చోట్ల మినహా దాదాపు అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌లోనే ఉండొచ్చన్న ఆవేదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నది. ఇంతకాలం సిట్టింగ్ స్థానాలుగా ఉన్నచోట కూడా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, వరంగల్ తదితర స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగానే కనిపిస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఓటింగ్ పర్సెంటేజీని గొప్పగా చెప్పుకుంటూ కనీసం గౌరవాన్ని నిలబెట్టుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చీలిక ఎంత ఎక్కువగా ఉంటుందో... అది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా ఎలాంటి ఎసరు పెడుతుందో... పార్టీ ఉనికిని ఏ మేరకు ప్రశ్నార్థకంగా మారుస్తుందో... రానున్న రోజుల్లో కేడర్ డీమోరల్ కాకుండా ఎలా నిలబెట్టుకోవాలో... ఇలాంటివన్నీ ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వం ముందున్న సవాళ్లుగా మారాయన్నది గులాబీ లీడర్ల వాదన. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిఫ్లెక్టు అవుతుందని, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో సంక్షోభం ఇంకా ఎంత ముదురుతుందోనన్న భయం వారిలో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed