- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి విను.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం: అమిత్ షా
దిశ, తెలంగాణ బ్యూరో : రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్.. భువనగిరి టికెట్ ను కేటాయించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన అమిత్ షా గురువారం భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కోసం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని, భువనగిరిలో రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన చెంచా అయిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు. ఫోర్జరీ చేసినందుకు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిని పార్టీ సస్పెండ్ చేసిందని, కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఆయన కాళ్లు పట్టుకుని మరీ పార్టీ పోటీలోకి దింపిందని షా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ లోక్ సభ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నిక ఓట్ ఫర్ జిహాద్.. ఓట్ ఫర్ డెవలప్ మెంట్ కు మధ్య జరుగుతున్న ఎన్నికగా ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ విరోధులకు, ప్రజా సంక్షేమం చేసే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికగా ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నిక రాహుల్ పిల్ల చేష్టల గ్యారెంటీకి, ప్రధాని మోడీ గ్యారెంటీకి మధ్య పోటీ అని కొనియాడారు. మూడు విడుతల ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లకు చేరువైందని, 400 సీట్లకు చేరువ కావాల్సి ఉందని ఆయన తెలిపారు. 2019లో తెలంగాణలో 4 సీట్లలో బీజేపీని గెలిపించారని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవులు తెరిచి వినాలని, ఈ ఎన్నికల్లో 10 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవబోతోందని అమిత్ షా జోస్యం చెప్పారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ మోడీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగమం చేయనుందన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా, శోచనీయంగా మారిందని ఆయన ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని, మోడీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధం చెబుతోందని ఫైరయ్యారు. కాంగ్రెస్ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కట్ చేసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి పదికి పైగా సీట్లు గెలిపిస్తే.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాహుల్ బాబా హామీ ఇచ్చి ఇచ్చి సూర్యాస్తమయంలోపు మరిచిపోతారని షా ఘాటు విమర్శలు చేశారు. రైతులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.5 లక్షల లోన్ ఇస్తామన్నారని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారని, కానీ ఏదీ నెరవేర్చలేదని ఫైరయ్యారు. కాంగ్రెస్ హామీలను ఇస్తామంటుంది కానీ.. ఎన్నటికీ నెరవేర్చదని ధ్వజమెత్తారు.
ప్రధాని మోడీ దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని లేకుండా చేశారని, నక్సల్ సిద్ధాంతాన్ని కూడా సమాప్తం చేశారని అమిత్ షా వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీ అరాచకాలను ఆపగలుగుతాయా అని షా ప్రశ్నించారు. ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని, ఈ మూడు వేర్వేరు కాదని షా పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ట్రయాంగిల్ లాంటివని ఆయన విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీలు షరియత్, ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడిపంచాలని చూస్తున్నాయని షా విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ భువనగిరి టెక్స్ టైల్ ఇండస్ట్రీ కోసం ఎంతో చేశారని, టెక్స్ టైల్ పాలసీ చాలా స్పష్టంగా రూపొందించారన్నారు. ప్రత్యేకమైన ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఎక్స్ పోర్ట్ వరకు స్పష్టమైన చానల్ ను రూపొందించి ఉత్పత్తిదారులకు, రైతులు, కార్మికులకు లబ్ధి చేకూర్చారని తెలిపారు. మోడీ రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో ఒక టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేశారని షా గుర్తుచేశారు. 140 కోట్లతో భువనగిరి నుంచి భూపాలపట్టణం వరకు జాతీయ రహదారిని నిర్మించారని, బీబీ నగర్ లో ఎయిమ్స్ ను స్థాపించారని, దీనివల్ల భువనగిరి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారని వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం పేరిట బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, పదేండ్లు ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని, కానీ ఆ పార్టీ కేవలం తమ కుటుంబం బాగు కోసమే పనిచేసిందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు ఐదేండ్లు అవకాశం కల్పించారని, కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీని కనీసం పది సీట్లలో గెలిపించాలని, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.