కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య.. నిన్న రాత్రే హుటాహుటిన ఢిల్లీకి పయనం

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య.. నిన్న రాత్రే హుటాహుటిన ఢిల్లీకి పయనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఒకేసారి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరూ హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డెసిషన్ తీసుకోనున్నారు. ఇప్పటికే వరంగల్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు. కానీ పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ కేసీఆర్‌కు గురువారం రాత్రి ఆమె లేఖ రాశారు. లేఖ రాసిన వెంటనే కావ్య తండ్రితో కలిసి ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కడియం శ్రీహరి పేరును ఈ నెల 31న ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఉపసంహరించుకున్న మొదటి వ్యక్తి కావ్య కావడం గమనార్హం.

కేసీఆర్‌కు రాసిన లేఖలో ఏమున్నది?

‘లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు, లిక్కర్ స్కామ్‌ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కేసీఆర్ గారు, పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను’ అని కావ్య.. కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Next Story