లోక్‌సభ ఎన్నికల వేళ KCR కీలక నిర్ణయం.. కేడర్‌లో జోష్ నింపేలా ప్లాన్..!

by GSrikanth |
లోక్‌సభ ఎన్నికల వేళ KCR కీలక నిర్ణయం.. కేడర్‌లో జోష్ నింపేలా ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మళ్లీ సర్వేల బాటపట్టింది. ఏ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది? గెలిచే అభ్యర్థులు ఎవరనేదానిపై ఆరా తీస్తోంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలోని నేతలతో కేసీఆర్ భేటీ అయి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో సత్తా చాటేందుకు కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నారు. కేడర్‌లో జోష్ నింపాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే సీట్లపై సర్వేలు ప్రారంభించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రజాధరణ ఉన్నవారికే పట్టం కట్టాలని భావిస్తున్నారు. ఒకవైపు సర్వేలు.. మరోవైపు కేసీఆర్ నేతలతో భేటీ అవుతూ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

నియోజకవర్గాల వారీగా లేటెస్ట్ స్టడీ

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఊహించని ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కారణంగా అధికారం కోల్పోయింది ఆ పార్టీ. అయితే, కాంగ్రెస్ సర్కార్ వచ్చి 3 నెలలు కావొస్తున్నా.. లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఎలాంటి అభిప్రాయం ఉందోనని సర్వే చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఏమనుకుంటున్నారు? వ్యతిరేకత ఏమైనా ప్రభుత్వంపై ఉందా? లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందా? అనేదానిపై రైతులు, పెన్షన్ దారులు, నిరుద్యోగుల నుంచి గులాబీ బాస్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సైతం వివరాలు సేకరిస్తున్నట్లు టాక్.

గెలిచే అభ్యర్థుల కోసం సెర్చ్..

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఎవరైతే గెలుస్తారు? ఎవరికి ఆర్థిక స్థోమత ఉంది. ఆశావహులు ఎంతమంది ఉన్నరు? వరంగల్‌లో టికెట్ ఆశిస్తున్న కడియం కావ్య, ఆరూరి రమేష్, పెద్ది స్వప్న, నల్లగొండలో కంచర్ల క్రిష్ణారెడ్డి, సైదిరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరిలో భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆదిలాబాద్‌లో ఆత్రం సక్కు, జహీరాబాద్‌లో పోచారం భాస్కర్ రెడ్డి, మల్కాజి‌గిరిలో శంభీపూర్ రాజు, లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్‌లో తలసాని సాయికిరణ్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, నరేందర్ గౌడ్, నిజామాబాద్‌లో బాజిరెడ్డి గోవర్దన్, మెదక్‌లో గాలి అనిల్ కుమార్, వంటేరు ప్రతాప్ రెడ్డి ఇలా పలువురి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారికి టికెట్ ఇస్తే గెలుస్తామా? లేదా? అనేదానిపై ఆరా తీస్తున్నారు.

ఆ నేతలతో అధినేత సమీక్ష

ఒకవైపు సర్వేలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రతిరోజూ 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎవరైతే కాంట్రవర్సీ లేకుండా ఉన్నారో వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి పూర్తి సహకారం అందించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదేశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వేరు.. పార్లమెంట్ ఎన్నికలు వేరని, ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమాను వారిలో కల్పిస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని, పార్టీ ఎవరి పేరును ప్రతిపాదించినా అందరూ కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. అయినా, కొందరు నేతలు సహకరించడం లేదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed