బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ.. ‘లోక్‌సభ’లో పోటీచేసే నేతలకు బంపరాఫర్

by GSrikanth |
బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ.. ‘లోక్‌సభ’లో పోటీచేసే నేతలకు బంపరాఫర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండటంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. ‘పైసలు మావే.. ప్రచారం మాదే.. మీరు కేవలం టికెట్ తీసుకుని బరిలో నిలుచోండి.. అంతా మేం చూసుకుంటాం’ అంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తున్నదని విశ్వసనీయ సమాచారం. గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీల చేయించుకుని మరీ పోటీపడిన నేతలు.. ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా.. వెనకడుగు వేస్తుండటంతో గమనార్హం. గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు. అందుకోసం నెలల తరబడి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న వారితో పైరవీలు చేయించేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి గడ్డుకాలం మొదలైంది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం పిలిచి టికెట్ ఆఫర్ చేస్తున్నా.. నేతలు ముందుకు రావడం లేదు. దీంతో లీడర్లకు కేసీఆరే స్వయంగా ఫోన్లు చేసి మరి మాట్లాడుతున్నట్టు తెలిసింది. ‘టికెట్ తీసుకుని బరిలో ఉండటమే మీ వంతు.. అన్ని అధిష్టానమే చూసుకుంటుంది’ అని భరోసా ఇస్తున్నట్టు టాక్. టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగిసే వరకు పర్యవేక్షిస్తామని, వెంటే ఉంటామని అధిష్టానం హామీ ఇస్తున్నది. ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందని, పోటీ చేసేవారు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది. అయినప్పటికీ నేతలు ముందుకు రావడం లేదని.. పోటీచేసి ఓడిపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని వారు వెనకడుగు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

భయపెడుతున్న రాజకీయ పరిస్థితులు!

మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన మరికొన్ని స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే ఉన్నది. అయినప్పటికీ గులాబీ నేతలు లోక్‌సభకు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీలో ఎవరు ఉంటారో? ఎవరు ఉండరో తెలియకపోవడంతో పోటీ చేసేందుకు నేతలు వెనకడుగు వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనుకున్నంతగా రిజల్ట్స్ రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకే అనుకూల ఫలితాలు వస్తాయని భావించే గులాబీ నేతలు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.

ఆఫర్లు ప్రకటించినా..

మహబూబ్‌నగర్, ఖమ్మం, చేవెళ్ల, మహబూబాబాద్ నియోజకవర్గాలకు ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంకా కొందరి పేర్లను సైతం ఫైనల్ చేసిందని, వారికి సహకరించి పార్టీ గెలుపు బాధ్యత తీసుకోవాలని నేతలను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఎన్నికల్లో ఖర్చు భరించలేక పోటీ నుంచి తప్పుకుంటామని పలువురు నేతలు అధిష్టానానికి వివరించినట్టు సమాచారం. దీంతో అలర్డయిన గులాబీ పార్టీ పెద్దలు.. ఖర్చు పార్టీయే భరిస్తుందని భరోసా ఇచ్చినట్టు టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కశాతం ఓట్లతోనే ఓడిపోయామని పార్టీ పెద్దలు.. సమావేశాల్లోనూ, మీడియా వేదికగానూ చెబుతున్నారు. అయినప్పటికీ నేతలు మాత్రం విశ్వసించడం లేదు. ఖర్చుల విషయంలో ఆఫర్ ఇచ్చినా కొందరు లీడర్లు పోటీకి వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. దీంతో భవిష్యత్తులో పార్టీ ఉనికి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.

దెబ్బకొడుతున్న గ్రూపు రాజకీయాలు..

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు రాజకీయాలకు మొదలయ్యాయి. జిల్లా నేతల మధ్య కోఆర్డినేషన్ లేదు. ఒక్కో జిల్లాలో రెండు, మూడు గ్రూపులుగా ఉన్నాయి. వాటిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడక తప్పలేదు. అయినప్పటికీ వాటికి పార్టీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. కొందరు నేతలు పోటీ దూరంగా ఉండటానికి ఇది సైతం ఓ కారణమని తెలుస్తున్నది. ఒకవేళ పోటీ చేస్తే మిగతా నేతలు సహకరించకపోతే ఓడిపోతామని.. దాని వల్ల పరువుపోతుందని.. మరో వైపు అధికార కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ కావడం ఎందుకని బరిలో నిలిచేందుకు విముకత చూపుతున్నట్టు బీఆర్ఎస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed