భయపడాలి.. లేదంటే.. కీలక వ్యాఖ్యలు చేసిన ధోనీ

by Harish |
భయపడాలి.. లేదంటే.. కీలక వ్యాఖ్యలు చేసిన ధోనీ
X

దిశ, స్పోర్ట్స్ : భయం, ఒత్తిడి చాలా ముఖ్యమైనవని, ఆ రెండూ లేకపోతే ధైర్యంగా ఉండలేమని చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తెలిపాడు. ఐపీఎల్-17లో చెన్నయ్ జట్టు లీగ్‌ దశకే పరిమితమైన విషయం తెలిసిందే. చెన్నయ్ ఫ్రాంచైజీ ధోనీ మాట్లాడిన ఓ వీడియోను గురువారం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియో ధోనీ మాట్లాడుతూ..‘భయం చాలా ముఖ్యమైనది. భయాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే, ఒకవేళ నాకు భయం లేకపోతే నేను ధైర్యంగా ఉండలేను. ఒత్తిడి కూడా ముఖ్యమే. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. భయం లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటా. సాధారణ విషయాన్ని గౌరవించను. రోడ్డు మీద నడుస్తున్నానో, తాడు మీద నడుస్తున్నానో అనేది అంత ముఖ్యం కాదు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ ముఖ్యమని నేను అనుకుంటున్నా.’ అని ధోనీ తెలిపాడు. కాగా, ఈ సీజన్‌‌ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ధోనీ సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను గాయంతో ఇబ్బందిపడినప్పటికీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 220 స్ట్రైక్‌రేటుతో 161 పరుగులు చేశాడు. గాయానికి చికిత్స కోసం ధోనీ త్వరలోనే లండన్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story