పంత్ ప్రతాపం.. గుజరాత్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ

by Dishanational5 |
పంత్ ప్రతాపం.. గుజరాత్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి రెచ్చిపోయాడు. హోం గ్రౌండ్‌లో సిక్సులు, ఫోర్లతో మోతమోగించాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీ జట్టును అక్షర్ పటేల్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నాడు. జట్టు స్కోరును 220 పరుగులు దాటించాడు. ఆఖరి ఓవర్లో 2, Wd, 6, 4, 6, 6, 6తో విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. అయితే, భారీ లక్ష్య ఛేదనలో తీవ్రంగా పోరాడిన గుజరాత్ టైటాన్స్(జీటీ) కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయిసుదర్శన్, డేవిడ్ మిల్లర్‌లు అర్ధసెంచరీలతో రాణించినా ఫలితం లేకుండాపోయింది.

ఐపీఎల్-17లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ నమోదుచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(66), కెప్టెన్ రిషబ్ పంత్(88) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఆఖర్లో త్రిస్టన్ స్టబ్స్(26; 7బంతుల్లో) సైతం రాణించడంతో జట్టు భారీ స్కోరు చేసింది. 225 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. చివరివరకు పోరాడినా నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సాయిసుదర్శన్(65), డేవిడ్ మిల్లర్(55) అర్ధసెంచరీలతో రాణించగా, వృద్ధిమాన్ సాహా(39) ఫరవాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో రసిఖ్ దర్ సలా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు, నోర్జ్టే, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. గుజరాత్ బౌలర్లలో వారియర్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు.

సాయి, మిల్లర్ పోరాడినా..

225 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టుకు మంచి ఆరంభం లభించకపోయినా.. చివరివరకు పోరాడింది. ఓపెనర్‌ శుభమన్ గిల్(6) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. దీంతో 13 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్(65; 39 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సులు), మరో ఓపెనర్‌ సాహా(39)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. ఓవర్‌కు 10 రన్‌రెట్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 70 పరుగులకుపైగా భాగస్వామ్యం అందించిన వీరి జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. సాహాను క్యాచ్‌ అవుట్ చేయడంతో 95 పరుగుల వద్ద జీటీ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా(1)ను అక్షర్ పటేల్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపించాడు. మరోవైపు, అర్ధసెంచరీ చేసుకున్న కొద్దిసేపటికే సాయి సుదర్శన్, ఆ వెంటనే షారుఖ్ ఖాన్(8), రాహుల్ తెవాతియా(4)లు సైతం అవుట్ అయ్యారు. దీంతో 152 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు.. కష్టాల్లో పడింది. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో 3 సిక్సులు, 6ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, మరో ఎండ్ నుంచి అంతగా సహకారం లభించకపోవడంతో కొద్దిసేపటికే ముకేశ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక, 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్(21; 11బంతుల్లో) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు ఆశలను సజీవంగా ఉంచాడు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం ఉండగా, తొలి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. దీంతో 4బంతుల్లో 11 పరుగులు అవసరముండగా, రెండు బాల్స్ డాట్ అయ్యాయి. ఐదో బంతికి సిక్సు కొట్టాడు. ఇక, ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా, అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. అయితే, ఒక్క పరుగూ రాలేదు. ఫలితంగా 4 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమిపాలైంది.

ఇద్దరూ కలిసి శతక్కొట్టారు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ జట్టుకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్(23), పృథ్వీ షా(11)తోపాటు నాలుగో స్థానంలో వచ్చిన షాయి హోప్(5) స్వల్ప స్కోర్లకే వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో స్థానంలో వచ్చిన అక్షర్‌తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు పంత్ సైతం తన ప్రతాపం చూపించాడు. దీంతో ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం అందించారు. అయితే, ఇన్నింగ్స్ 157 పరుగుల వద్ద అక్షర్ పటేల్‌(66)ను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. అక్షర్ అవుటైనా ఏమాత్రం దూకుడు తగ్గించని పంత్.. త్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. 34 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్న పంత్.. మరింత రెచ్చిపోయాడు. స్టబ్స్ సైతం మెరుపులు మెరిపించాడు. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో 31 పరుగులు సాధించి, 43 బంతుల్లో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన అద్భుతమైన ఆటతీరుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్: 224/4 (20 ఓవర్లు)

గుజరాత్ టైటాన్స్: 220/8 (20 ఓవర్లు)




Next Story