అమెరికా కేక.. సూపర్ ఓవర్‌లో పాక్ చిత్తు

by Harish |
అమెరికా కేక.. సూపర్ ఓవర్‌లో పాక్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా.. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. మొదటి నుంచి పాక్‌కు చెమటలు పట్టించిన యునైటెడ్ స్టేట్స్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లి మరి సొంతం చేసుకుంది. గురువారం డల్లాస్ వేదికగా గ్రూప్ ఏలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్‌లో 5 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 159/7 స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన అమెరికా కూడా నిర్ణీత ఓవర్లలో 159/3 స్కోరు చేయడంతో మ్యాచ్ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అక్కడ అమెరికా ఒక్క వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. 19 పరుగుల లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 13/1 స్కోరుకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో అమెరికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అమెరికాకు ఇది వరుసగా రెండో విజయం. మరోవైపు, పాక్‌ ఓటమితో ప్రపంచకప్‌ను మొదలుపెట్టింది.

మెరిసిన మోనాంక్.. ఆఖర్లో జోన్స్

బలమైన పాక్ బౌలింగ్‌ ముందు అమెరికా పోటీనిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకు తగ్గట్టే ఛేదనలో ఓపెనర్ టేలర్(12)ను నసీమ్ షా త్వరగానే అవుట్ చేశాడు. ఆ తర్వాత అమెరికా పుంజుకున్న తీరు అద్భుతం. మోనాంక్ పటేల్(50), గౌస్(35) సంచలన ఇన్నింగ్స్ ఆడారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరు సింగిల్స్ తీస్తూనే బౌండరీలు బాదతూ లక్ష్యాన్ని కరిగించారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో అమెరికా పోటీలోకి వచ్చింది. ఈ క్రమంలో మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ వికెట్ పారేసుకోవడంతో పాక్ విజయం ఖాయమే అనిపించింది. అయితే, ఆరోన్ జోన్స్ మరోసారి అదరగొట్టాడు. నితీశ్ కుమార్(14)తో కీలక ఇన్నింగ్స్ ఆడిన జోన్స్ పాక్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఆఖరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. వీరిద్దరూ 14 పరుగులు రాబట్టడంతో స్కోర్లు సమమయ్యాయి.

కష్టపడ్డ పాక్

అంతకుముందు అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. పవర్ ప్లేలో ఆ జట్టుకు వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ రిజ్వాన్(9), ఉస్మాన్ ఖాన్(3), ఫకర్ జమాన్(11) చేతులెత్తేయడంతో పాక్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజామ్(44), షాదాబ్ ఖాన్(40) ఇన్నింగ్స్ నిర్మించారు. బాబర్ నిదానంగా ఆడగా.. షాదాబ్ ఖాన్ ధాటిగా ఆడాడు. ఈ జోడీ మూడో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. అయితే, కెంజిగె ఒకే ఓవర్‌లో షాదాబ్‌తోపాటు అజమ్ ఖాన్(0)ను అవుట్ చేయడంతో పాక్ ఇబ్బందుల్లో పడింది. కాసేపటికే బాబర్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది(23 నాటౌట్) కీలక పరుగులు జోడించడంతో పాక్ కష్టంగా పోరాడే స్కోరు సాధించింది. అమెరికా బౌలర్లలో నోస్తుష్ కెంజిగె 3 వికెట్లు, నేత్రవల్కర్ 2 వికెట్లతో సత్తాచాటారు.

సంక్షిప్త స్కోరుబోర్డు

పాకిస్తాన్ ఇన్నింగ్స్ : 159/7(20 ఓవర్లు)

(బాబర్ ఆజామ్ 44, షాబాద్ ఖాన్ 40, షాహీన్ అఫ్రిది 23 నాటౌట్, నోస్తుష్ కెంజిగె 3/30)

అమెరికా ఇన్నింగ్స్ : 159/3(20 ఓవర్లు)

(మోనాంక్ పటేల్ 50, ఆండ్రీస్ గౌస్ 35, ఆరోన్ జోన్స్ 36 నాటౌట్, నితీశ్ కుమార్ 14 నాటౌట్)

Advertisement

Next Story

Most Viewed