T20 World Cup : సూపర్-8లో టీమ్ ఇండియా ఆట మారుతుందా?

by Harish |
T20 World Cup : సూపర్-8లో టీమ్ ఇండియా ఆట మారుతుందా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో గ్రూపు దశను దాటడానికి రోహిత్ సేన పెద్దగా కష్టపడలేదు. కానీ, భారత జట్టు ప్రదర్శనపై మాత్రం అభిమానులు పూర్తిగా సంతృప్తిగా లేరు. దానికి కారణం యూఎస్‌ఏ పిచ్‌లపై టీమ్ ఇండియా తడ‘బ్యాటే’. బౌలర్లు అదరగొట్టగా.. బ్యాటర్లు మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. మిగతా జట్లు కూడా ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లపై లో స్కోర్లే నమోదు చేసినా.. ఎంతో అనుభవం ఉన్న భారత ఆటగాళ్లు విఫలమవడం ఆందోళన కలిగించే విషయమే. పాకిస్తాన్, అమెరికా మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా గెలుపు కోసం శ్రమించాల్సి వచ్చింది. పాక్‌పై 119 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటవ్వగా.. బౌలర్లు మెరవడంతో ఓటమి తప్పింది. అమెరికా నిర్దేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్ ఇండియా చెమటోడ్చడాన్ని చూశాం. దీంతో భారత్ ఆటపై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేయాల్సిన బాధ్యత రోహిత్ సేన మీద ఉంది. వేదిక మారింది. భారత్ ఆట కూడా మారాలి. సూపర్-8 రౌండ్‌లో అదరగొట్టాలి. రెండో రౌండ్‌లో రేపు ఆఫ్ఘనిస్తాన్‌తో రోహిత్ సేన తొలి మ్యాచ్ ఆడనుంది.

బంగ్లా, అఫ్గాన్‌లతో జాగ్రత్త.. ఆసిస్‌తో సవాల్

టీమ్ ఇండియా కరేబియన్ గడ్డపై మిగతా మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 20న ఆఫ్ఘనిస్తాన్‌తో పోరుతో సూపర్-8 రౌండ్‌ను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత 22న బంగ్లాదేశ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండో దశ పోరు టీమ్ ఇండియాకు మరీ కఠినతరం కాదు.. అలాగనీ తేలికేం కాదు. అఫ్గాన్, బంగ్లాలపై భారత్‌కు విజయం కొంచెం కష్టపడితే సులువే. కానీ, ఆ రెండు తమదైన రోజున సంచలనం సృష్టించగలవు. తొలి రౌండ్‌లో న్యూజిలాండ్‌ను అఫ్గాన్, శ్రీలంకను బంగ్లా ఓడించాయి. కాబట్టి, ఆ జట్లతో జాగ్రత్తగా ఆడాల్సిందే. ఇక, భారత్‌కు అసలైన సవాల్ ఆస్ట్రేలియాతోనే. ఆ జట్టు ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. పైగా ఆ జట్టు తన తొలి రౌండ్ మ్యాచ్‌లను కరేబియన్ వేదికలపైనే ఆడింది. కాబట్టి, పిచ్‌లపై ఆసిస్‌కు ఓ అవగాహన వచ్చే ఉంటుంది. ఆసిస్‌పై నెగ్గాలంటే రోహిత్ సేన అన్ని అస్త్రాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.

అందరి కళ్లు కోహ్లీపైనే

గతేడాది వన్డే వరల్డ్ కప్‌, ఇటీవల ఐపీఎల్‌లోనూ కోహ్లీనే టాప్ స్కోరర్. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. తీరా అమెరికా పిచ్‌లపై అతను దారుణంగా నిరాశపరిచాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతని చేసిన స్కోర్లు 1, 4, 0. ఐర్లాండ్, అమెరికా వంటి జట్లపై కూడా విరాట్ తడబడటం ఆందోళన కలిగిస్తున్నది. సూపర్-8 రౌండ్‌లో అతను పుంజుకోవడం జట్టుకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో అందరి కళ్లన్నీ అతనిపైనే ఉండనున్నాయి. మరి, కోహ్లీ కరేబియన్ గడ్డపై ఎలా ఆడతాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed