కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హార్దిక్.. జూనియర్ గర్ల్స్‌తో పోలుస్తూ కామెంట్

by Harish |
కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హార్దిక్.. జూనియర్ గర్ల్స్‌తో పోలుస్తూ కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత పురుషుల హాకీ జట్టు మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కోహ్లీ ఫిట్టెస్ట్ అథ్లెట్ కాదని, అతని ఫిట్‌నెస్ స్థాయి భారత హాకీలో జూనియర్ గర్ల్స్‌ ఫిట్‌నెస్‌తో పోల్చదగిందని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో హార్దిక్.. క్రికెటర్ల కంటే భారత హాకీ ప్లేయర్లు ఫిట్టెస్ట్ అని తెలిపాడు. ‘క్రికెట్‌లో ఎవరైనా యో-యో టెస్టులో 19 లేదా 20 స్కోరు చేస్తే అందరూ అతన్ని ఫిట్టెస్ అని అంటారు. మాజీ గోల్‌కీపర్ శ్రీజేశ్ స్కోరు 21. విరాట్ కోహ్లీ దేశంలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కావొచ్చు. కానీ, ఫిట్టెస్ట్ అథ్లెట్ మాత్రం కాదు. విరాట్ ఫిట్‌నెస్ భారత హాకీలో జూనియర్ గర్ల్స్ ఫిట్‌నెస్‌తో సమానమైనది. జూనియర్ గర్ల్స్ 17-18 స్కోరు చేస్తారు. మేము 22-23 స్కోరు చేస్తాం. మాలో ఏడుగురు 23.8 స్కోరు సాధించారు. వాస్తవానికి యో-యో టెస్టులో 23.8 స్కోరు చేసిన భారత సీనియర్ హాకీ ప్లేయర్లు దేశంలో ఫిట్టెస్ ప్లేయర్లు. కాబట్టి, విరాట్ భారత ఫిట్టెస్ట్ ప్లేయర్ అనే మోసాన్ని ఇప్పటికైనా ఆపండి.’ అంటూ హార్దిక్ సంచలన కామెంట్స్ చేశాడు.

మమ్మల్ని పట్టించుకోలేదు.. అతనితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు

అదే పాడ్‌కాస్ట్‌లో హార్దిక్.. ఇటీవల హాకీ ఆటగాళ్లకు ఎదురైన ఓ నిరాశాజనకమైన సంఘటనను పంచుకున్నాడు. అభిమానులు వరుస ఒలింపిక్స్‌ల్లో పతకం గెలిచిన తమను కాకుండా సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలాతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారని తెలిపాడు. ‘ఎయిర్‌పోర్టులో నేను, హర్మన్‌ప్రీత్, మన్‌దీప్‌తోపాటు ఇంకా ఐదారుగురు ఆటగాళ్లు ఉన్నాం. డాలీ చాయ్‌వాలా కూడా ఉన్నాడు. అభిమానులు అతనితో ఫొటోలు తీసుకుంటున్నారు. మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. మేము ఒకరిని ఒకరం చూసుకున్నాం. మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. క్రీడాకారులకు కీర్తి, డబ్బు ముఖ్యమే. కానీ, అభిమానుల నుంచి అభినందనలు పొందడం కంటే ఓ అథ్లెట్‌కు సంతృప్తి మరొకటి ఉండదు’ అని చెప్పుకొచ్చాడు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌ల్లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు‌లో హార్దిక్ సభ్యుడు.

Advertisement

Next Story