టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన అఫ్గాన్

by Harish |
టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన అఫ్గాన్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన అఫ్గాన్ చిన్న జట్టు ఉగాండాను చిత్తు చేసింది. గయానా వేదికగా మంగళవారం జరిగిన గ్రూపు సి మ్యాచ్‌లో ఉగాండాపై 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 183/5 స్కోరు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్(76), ఇబ్రహీం జద్రాన్(70) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఉగాండా కుప్పకూలింది. రాబిన్సన్ ఒబుయా చేసిన 14 పరుగులే టాప్ స్కోరంటే ఆ జట్టు బ్యాటర్లు ఏ విధంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఫజల్లా ఫరూఖీ ఐదు వికెట్ల తీసి ఉగాండా పతనాన్ని శాసించాడు.

గుర్బాజ్, జద్రాన్ ధనాధన్

అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల ఆట హైలెట్. గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ ఉగాండా బౌలర్లను ఊచకోతకోస్తూ మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన అతను 28 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొదట నిదానంగా ఆడిన జద్రాన్ 6వ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు కొట్టి గేర్ మార్చాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన అతను కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరి దూకుడుతో అఫ్గాన్ 14 ఓవర్లలో 152/0తో నిలువగా.. 200కుపైగా స్కోరు చేసేలా కనిపించింది. ఆలస్యంగా పుంజుకున్న ఉగాండా బౌలర్లు డెత్ ఓవర్లలో అఫ్గాన్‌ను కట్టడి చేశారు. 31 పరుగుల వ్యవధిలోనే అఫ్గాన్ ఐదు వికెట్లు కోల్పోయింది. జద్రాన్(70), గుర్బాజ్(76), నజీబుల్లా(2), గుల్బాదిన్(4), అజ్మతుల్లా(5) వరుసగా పెవిలియన్ క్యూకట్టారు. దీంతో అఫ్గాన్ 200లోపే పరిమితమైంది. ఉగాండా బౌలర్లలో మసాబా, కాస్మాస్ క్యూవుటా రెండేసి వికెట్లతో రాణించారు.

ఫరూఖీ దెబ్బకు ఉగాండా విలవిల

ఛేదనలో అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఉగాండా విలవిలలాడిపోయింది. ముఖ్యంగా ఫరూఖీ దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫరూఖీ వేసిన తొలి ఓవర్‌లోనే రోనక్ పటేల్(4), సైమన్ సెసాజి(4) అవుటవడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత ఫరూఖీకి నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ కూడా తోడవడంతో ఉగాండా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. రాబిన్సన్ ఒబుయా(14), రియాజత్ అలీ షా(11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. నలుగురు ఖాతా కూడా తెరవలేదు. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫరూఖీ ఐదు వికెట్లతో ఉగాండాను కుప్పకూల్చగా.. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. ముజీర్ రెహ్మాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ : 183/5(20 ఓవర్లు)

(గుర్బాజ్ 76, ఇబ్రహీం జద్రాన్ 70, మసాబా 2/21, కాస్మాస్ క్యూవుటా 2/25)

ఉగాండా ఇన్నింగ్స్ : 58 ఆలౌట్(16 ఓవర్లు)

(రాబిన్సన్ ఒబుయా 14, ఫరూఖీ 5/9, నవీన్ ఉల్ హక్ 2/4, రషీద్ ఖాన్ 2/12)

Advertisement

Next Story

Most Viewed