T20 World Cup : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. టీ20ల్లో ఏ జట్టుది ఆధిపత్యమో తెలుసా?

by Harish |
T20 World Cup : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. టీ20ల్లో ఏ జట్టుది ఆధిపత్యమో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఆ రేంజ్‌లో క్రికెట్ అభిమానులకు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. సోమవారం గ్రాస్ ఐలెట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సూపర్-8 రౌండ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. అఫ్గాన్, బంగ్లాపై విజయాలతో భారత్‌ దాదాపు సెమీస్‌ బెర్త్ ఖాయం చేసుకుంది. ఆసిస్‌ను కూడా ఓడిస్తే దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టొచ్చు. మరోవైపు, అఫ్గాన్ చేతిలో ఘోర పరాజయం‌తో ఆసిస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. భారత్‌తో మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డై లాంటింది. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిందే. మరి, రోహిత్ సేన కంగారులకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.

అదే జోరు కొనసాగాలి

టోర్నీ మొదటి నుంచి భారత్‌కు బౌలింగ్ పరంగా ఆందోళన లేదు. బుమ్రా, అర్ష్‌దీప్, పాండ్యా‌లకుతోడు ఇప్పుడు కుల్దీప్ జట్టుకు బలంగా మారాడు. టెన్షన్ అంతా బ్యాటింగ్‌పైనే ఉండేది. అయితే, బంగ్లాతో మ్యాచ్‌ తర్వాత ఆ ఆందోళన కూడా తొలిగినట్టే. రోహిత్, కోహ్లీ జోడీ కుదురుకుంది. వీరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టడంతో మిగతా బ్యాటర్లు కూడా చెలరేగారు. ఆసిస్‌పై కూడా వీరు మెరుపు ఆరంభమిస్తే భారీ స్కోరు సులువే. పంత్, పాండ్యా ప్రధాన బలంగా మారారు. దూబె టచ్‌లో ఉండగా.. జడేజా, అక్షర్ కూడా మెరిస్తే జట్టుకు తిరుగుండదు. మొత్తంగా బంగ్లాపై కనబర్చిన ఆల్‌రౌండ్ ప్రదర్శననే ఆసిస్‌పై కూడా కొనసాగించాల్సి ఉంది.

ఆసిస్‌‌తో సవాలే

అఫ్గాన్‌పై ఓడినంత మాత్రన ఆసిస్‌ బలాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కంగారులపై విజయం అంత తేలికగా కాదు. హెడ్, వార్నర్, స్టోయినిస్‌లకుతోడు మ్యాక్స్‌వెల్‌ కూడా అఫ్గాన్‌పై ఫామ్ అందుకున్నాడు. వేడ్, డేవిడ్ సైతం ప్రమాదకరమే. బౌలింగ్‌పరంగా ఆ జట్టు బలంగా కనిపిస్తున్నది. కమిన్స్ వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. స్టార్క్, ఆడమ్ జంపా, హాజెల్‌వుడ్ వంటి వారితో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.

టఫ్ ఫైట్ తప్పదా?

భారత్, ఆసిస్ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే అభిమానులకు కిక్కిచ్చే మ్యాచ్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాగే, డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లకు మంచి రికార్డు ఉండటమూ మరో కారణం. ఆ స్టేడియంలో తలపడటం ఇరు జట్లకు ఇదే మొదటిసారి. కానీ, వేర్వేరుగా ఇతర ప్రత్యర్థులతో ఆడాయి. భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గింది. ఆసిస్ 10 ఆడితే ఆరింట విజయం సాధించింది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.

ప్రత్యర్థిని కంగారెత్తించారు

టీ20 ఫార్మాట్‌లో ఆసిస్‌పై భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఇరు జట్లు 31 మ్యాచ్‌ల్లో ఎదురుపడగా.. 19 విజయాలతో టీమ్ ఇండియాదే పైచేయి. ఆసిస్ 11 మ్యాచ్‌ల్లో నెగ్గగా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరి ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ 4-1తో ఆధిక్యంలో ఉన్నది. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా భారత్ 3-2తో ఉన్నది.

బ్యాటింగ్ ఫ్రెండ్లీ

డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 180. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపనున్నారు. టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్ పాండ్యా, జడేజా అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్.

ఆస్ట్రేలియా : హెడ్, వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, కమిన్స్, అష్టన్ అగర్/స్టార్క్, ఆడమ్ జంపా. హాజెల్‌వుడ్.

Advertisement

Next Story

Most Viewed