ఐర్లాండ్‌కు షాక్.. కెనడాకు చారిత్రాత్మక విజయం

by Harish |
ఐర్లాండ్‌కు షాక్.. కెనడాకు చారిత్రాత్మక విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో కెనడా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో కంగుతిన్న ఆ జట్టు తన రెండో మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. ఐర్లాండ్‌కు షాకిచ్చి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూపు ఏ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో చిన్న జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. నికోలస్ కిర్టన్(49), శ్రేయాస్ మొవ్వ(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో వీరిద్దరూ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్(2/32), మెకార్తీ(2/24) సత్తాచాటారు.

అనంతరం కెనడా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకున్నారు. దీంతో ఛేదనలో ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 125/7 స్కోరే చేసింది. మొదటి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కెనాడా బౌలర్లు 59 పరుగులకే 6 వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఆ తర్వాత మార్క్ అడైర్(34), జార్జ్ డాక్రెల్(30 నాటౌట్) పోరాడినా ఐర్లాండ్‌ను గెలిపించలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో ఐర్లాండ్ గెలవడానికి 17 పరుగులు అవసరమవ్వగా.. బౌలర్ గోర్డాన్ 4 పరుగులే ఇవ్వడంతో ఐర్లాండ్ విజయానికి 12 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఐర్లాండ్‌కు వరుసగా ఇది రెండో ఓటమి. కెనడా బౌలర్లలో గోర్డాన్(2/16), డిలాన్ హేలిగర్(2/18) రెండేసి వికెట్లతో రాణించారు. బ్యాటుతో మెరిసి కెనడా విజయంలో కీలక పాత్ర పోషించిన నికోలస్ కిర్టన్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

సంక్షిప్త స్కోరుబోర్డు

కెనడా ఇన్నింగ్స్ : 137/7(20 ఓవర్లు)

(నికోలస్ కిర్టన్ 49 , శ్రేయాస్ మొవ్వ 37, క్రెయిగ్ యంగ్ 2/32 , మెకార్తీ 2/24)

ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 125/7(20 ఓవర్లు)

(అడైర్ 34 , జార్జ్ డాక్రెల్ 30 నాటౌట్, గోర్డాన్ 2/16, డిలాన్ హేలిగర్ 2/18)

Advertisement

Next Story

Most Viewed