దొంగను పట్టుకుని రెండు రోజులు బంధించిన వీడీసీ సభ్యులు.. పోలీసుల ఎంట్రీతో..

by Rajesh |
దొంగను పట్టుకుని రెండు రోజులు బంధించిన వీడీసీ సభ్యులు.. పోలీసుల ఎంట్రీతో..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలం దేగాం గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు దొంగను రెండు రోజులు అదుపులో ఉంచుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతుల విద్యుత్ మోటార్ల కరెంట్ బాక్స్‌ల స్టాటర్ల దొంగను బందీగా ఉంచిన విషయం గురువారం బయటకు వచ్చింది. దీంతో గురువారం ఆర్మూర్ పోలీసులు వీడీసీ అదుపులో ఉన్న ఆ దొంగను ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. ఆలూర్ మండలం దేగాం గ్రామంలో గత కొన్ని రోజులుగా రైతుల పంట పొలాల్లోని విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు, స్టార్టర్లు, విద్యుత్ సామాగ్రి దొంగతనాలు జరుగుతున్నాయి.దీంతో ఆ గ్రామస్తులు నిఘా ఉంచి రెండు రోజుల కిందట ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది.

పొలాలలో విద్యుత్ సామాగ్రి స్టార్టర్లను దొంగతనం చేస్తున్న దొంగను పట్టుకొని గ్రామస్తులు వివరాలు ఆరా తీస్తున్న విషయం జిల్లా పోలీస్ అధికారి కల్మేశ్వర దృష్టికి వెళ్లింది. దీంతో ఆర్మూర్ పోలీసులు జిల్లా సీపీ ఆదేశాల మేరకు విడిసి అదుపులో ఉన్న దొంగను పోలీసులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగించాల్సి ఉండగా గ్రామస్తులు అదుపులో తీసుకొని తమదైన పద్ధతిలో విచారణ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరి పొలాల్లో విద్యుత్ సామాగ్రిని దొంగతనం చేశారనే విషయాలను తెలుసు కుంటుండగా జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలకు ఆర్మూర్ పోలీసులు అప్పుడే కర్తవ్యం‌లోకి దిగినట్లు సమాచారం.

ఆలూరు మండలంలోని దేగం వీడీసీ అదుపులో ఉన్న ఆ దొంగను ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. పైగా రెండు రోజులుగా దేగం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు దొంగను పట్టుకుని గ్రామ వీడీసీ అదుపులో ఉంచుకొని విచారిస్తున్న విషయం ఆర్మూర్ పోలీసులకు తెలియకపోవడం విడ్డూరం. దొంగలను పోలీసులు అదుపులో ఉంచుకొని విచారించాల్సింది పోయి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తమదైన శైలిలో ఆరా తీయడం చూస్తుంటే గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో రాజ్యాంగ శక్తిగా అవతరించి ప్రభుత్వానికి సమాంతరంగా అధికారాన్ని చలాయిస్తున్నట్లు కనబడుతోంది.

జిల్లా పోలీసు బాస్ ఆదేశాలతో కదిలిన ఆర్మూర్ పోలీస్ యంత్రాంగం దేగం వీడీసీ అదుపులో ఉన్న దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించి, అదుపులో రెండు రోజులు ఉంచుకున్న వీడీసీ సభ్యులను గురువారం రాత్రి ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పిలిచినట్లు తెలిసింది. కాగా గ్రామ వీడీసీ సభ్యులకు మద్దతుగా గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీస్ అధికారులతో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఓ దొంగను రెండు రోజులపాటు పోలీసులకు అప్పగించకుండా తమ ఆధీనంలో ఉంచుకున్న ఆ గ్రామ వీడిసి సభ్యుల విషయంలో ఆర్మూర్ పోలీస్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed