డ్రగ్స్​ దందాకు యాంటీ నార్కొటిక్ ​బ్యూరో చెక్..

by Vinod kumar |
డ్రగ్స్​ దందాకు యాంటీ నార్కొటిక్ ​బ్యూరో చెక్..
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డ్రగ్స్​ దందాకు చెక్​ పెట్టేందుకు ప్రారంభమైన తెలంగాణ యాంటీ నార్కొటిక్ ​బ్యూరో లక్ష్యం దిశలో సత్ఫలితాలు సాధిస్తోంది. ఒక్క జూన్, జూలై నెలల్లోనే 26 కోట్ల లక్షా ముప్పయి నాలుగువేల ఆరువందల యాభై రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను సీజ్ చేసింది. మొత్తం 196 కేసులు నమోదు చేసిన యాంటీ నార్కోటిక్ ​బ్యూరో అధికారులు మొత్తం 399 మంది డ్రగ్​పెడ్లర్లను కటకటాల వెనక్కి పంపించారు. మోస్ట్​ హ్యాపెనింగ్​ సిటీగా చెప్పుకొంటున్న హైదరాబాద్​ డ్రగ్స్​కు కేరాఫ్​ అడ్రస్​గా మారిన విషయం తెలిసిందే. విశాఖ, ఒడిషాలోని ఏజన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి, హాష్​ ఆయిల్, ఓపీఎం, వీడ్​ ఆయిల్ ఇక్కడికి స్మగుల్​ అవుతుండగా గోవా, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి హెరాయిన్, కోకైన్, ఎండీఎంఏ తదితర డ్రగ్స్​ఇక్కడికి పెద్ద మొత్తంలో చేరుతున్నాయి.

పదుల సంఖ్యలో డ్రగ్​ పెడ్లర్లు మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టుగా ఈ మత్తు పదార్థాలను విద్యార్థులు, సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లు, వైద్యులు, ఇతర వ్యక్తులకు అమ్ముతున్నారు. టాలీవుడ్​కు చెందిన కొందరు సెలబ్రెటీలకు కూడా కొంతమంది డ్రగ్​ పెడ్లర్లు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఇలా తేలికగా దొరుకుతున్న మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న వారిలో పలువురు చేజేతులా తమ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

మత్తు నుంచి బయట పడలేక భవిష్యత్తును చిదిమేసుకుంటున్నారు. మరికొందరు మాదక ద్రవ్యాల మత్తులో దారుణమైన నేరాలకు ఒడిగడుతున్నారు. దీనికి నిదర్శనంగా రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్​పేట నందనవనం వాంబే కాలనీలో పదహారేళ్ల బాలికపై ముగ్గురు గంజాయి మత్తులో గ్యాంగ్​ రేప్ ​చేయటాన్ని ఉదహరించవచ్చు. ఇక, గంజాయి ఇతర డ్రగ్స్​మత్తులో కొందరు ఏ కారణం లేకున్నా దాడులకు పాల్పడుతుండటం, తమలో తామే గొడవలు పడి కత్తులతో పొడుచుకోవటం, బ్లేడ్​ దాడులు చేసుకుంటుండటం తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

మే 31న..

ఈ క్రమంలోనే విచ్చలవిడిగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు చెక్​పెట్టేందుకు మే 31న తెలంగాణ యాంటీ నార్కొటిక్​ బ్యూరోను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్‌గా హైదరాబాద్ ​పోలీస్​ కమిషనర్​ సీ.వీ. ఆనంద్​వ్యవహరిస్తున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అమ్మకాలను అరికట్టేందుకుగాను యాంటీ నార్కొటిక్ ​బ్యూరో అధికారులు రాష్ర్టంలోని వేర్వేరు జిల్లాల పోలీస్​యూనిట్లతోపాటు వేర్వేరు రాష్ర్టాల పోలీసులతో సమన్వయాన్ని ఏర్పరుచుకున్నారు. డ్రగ్స్​దందాకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో పక్కాగా సమాచారాన్ని సేకరిస్తూ మత్తు పదార్థాల స్మగ్లర్లతోపాటు పెడ్లర్లను పట్టుకుంటున్నారు.

ఒక్క జూన్, జూలై నెలల్లో కలిపి 5వేల డెబ్భయి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 115గ్రాములు ఎండీఎంఏ, 48.56గ్రాముల హెరాయిన్, 83.95గ్రాముల కొకైన్, 100గ్రాముల ఓపీఎంను సీజ్​చేశారు. దాంతోపాటు 3వేల ఇరవై రెండు కిలోగ్రాముల హాష్​ ఆయిల్, 4వందల వీడ్​ఆయిల్, అయిదు బాక్సుల గంజాయి వీడ్ ​ఆయిల్, 3,851 ఇంజక్షన్లు, 3వేల మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి మొత్తం 196 కేసులు నమోదు చేసిన యాంటీ నార్కొటిక్​ బ్యూరో అధికారులు మొత్తం 399మందిని అరెస్టు చేసి జైలుకు రిమాండ్​చేశారు.

ట్రాక్ ​రికార్డు..

డ్రగ్స్ ​కేసుల్లో అరెస్టు చేస్తున్న నిందితులకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేసి పెడుతున్నట్టు యాంటీ నార్కొటిక్​ బ్యూరో విభాగానికి చెందిన ఓ అధికారి చెప్పారు. దీని వల్ల వారిపై నిఘా ఉంచటానికి వీలు కలుగుతుందని చెప్పారు. మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్​ కూడా ప్రయోగిస్తామన్నారు.

మిషన్​ పరివర్తన..

ఒకడైపు డ్రగ్స్ ​స్మగ్లర్లు, పెడ్లర్లను అరెస్టులు చేస్తున్న యాంటీ నార్కొటిక్ ​బ్యూరో అధికారులు అదే సమయంలో మత్తు ఊబిలో కూరుకుపోయిన వారిని దాని నుంచి బయట పడేయటానికి, డ్రగ్స్​ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించటానికి ఆపరేషన్​పరివర్తన్​పేరుతో కార్యక్రమాలు జరుపుతున్నారు. దీని కోసం రాష్ర్టవ్యాప్తంగా విద్యా సంస్థలతోపాటు ఇతర చోట్ల చర్చా కార్యక్రమాలు, గ్రాఫిక్​ ప్రదర్శనలు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అధికారులకు కూడా..

డ్రగ్స్​రహిత రాష్ర్టాన్ని సాధించే లక్ష్యంతో ప్రారంభమైన యాంటీ నార్కొటిక్ ​బ్యూరోలో పని చేస్తున్న అధికారులకు కూడా ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా జిల్లాలు, రాష్ర్టాల పోలీసులతో ఏ విధంగా సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవాలి? డ్రగ్స్​దందాను అరికట్టటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలను వివరిస్తున్నారు. ఎన్డీపీఎస్, ఎస్ఏఎఫ్ఈఎంఏ చట్టాలపై అవగాహన కలిగిస్తున్నారు. రేపటి తరాన్ని మత్తు పదార్థాలకు దూరంగా పెట్టే లక్ష్యంతో ప్రారంభించిన యాంటీ నార్కొటిక్​ బ్యూరోలోని ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed