చేయని తప్పుకి మూడేళ్ల జైలు శిక్ష.. అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్

by GSrikanth |
చేయని తప్పుకి మూడేళ్ల జైలు శిక్ష.. అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారుల నిర్లక్ష్యం సామాన్యుల జీవితాలను ఎంతలా చిన్నాభిన్నం చేస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ-మెయిల్‌లో వచ్చిన ఆర్డర్ కాపీని అధికారులు చూడకపోవడంతో ఓ వ్యక్తి మూడేళ్లపాటు జైలులోనే మగ్గిపోవాల్సి వచ్చింది. గుజరాత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన చందన్ జీ ఠాకూర్ (27) ఓ హత్య కేసులో దోషిగా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే 29 సెప్టెంబర్ 2020న గుజరాత్ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. కరోనా సమయంలో కావడం వల్ల ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీనీ ఈ-మెయిల్ ద్వారా జైలు అధికారులకు పంపించింది.

అయితే కోర్టు పంపించిన బెయిల్ ఆర్డర్ కాపీలు కోర్టు రిజిస్ట్రీ నుంచి జైలు అధికారులు రిసీవ్ చేసుకున్నా.. అందులో పేర్కొన్న అటాచ్ మెంట్‌లను మాత్రం తెరిచి చూడలేదు. దీంతో బెయిల్ వచ్చినప్పటికీ చందన్ జీ ఠాకూర్ మాత్రం 2023 వరకు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి ఠాకూర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారుల నిర్వాకం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం బాధితుడికి లక్ష పరిహారం అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోవిడ్ సమయంలో ఈ-మెయిల్ రూపంలో వచ్చి ఆదేశాలు అమలు అయ్యాయా లేదా అనేది తేల్చాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీకి సూచించింది.

Advertisement

Next Story