గణేషుడిని చూద్దామని తీసుకెళ్లి...హతమార్చాడు

by Sridhar Babu |
గణేషుడిని చూద్దామని తీసుకెళ్లి...హతమార్చాడు
X

దిశ, బాల్కొండ : గణేషుడిని చూద్దామని తీసుకెళ్లి బాలుడిని హతమార్చాడు. బాల్కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాల్కొండ ఖిల్లా ప్రాంతంలో మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన నచ్చు రాకేష్ (12) దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 11న చిట్టాపూర్ గ్రామం నుంచి బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బండి నరేందర్ అనే వ్యక్తి గణపతులను చూసి వద్దామని రాకేష్ ను తీసుకొని వెళ్లాడు. నరేందర్ ఇంటికి వచ్చినా రాకేష్​ రాత్రి 11 గంటల వరకు కూడా రాలేదు. దాంతో నరేందర్ ను కుటుంబ సభ్యులు నిలదీశారు. కానీ నరేందర్ నుండి సరైన సమాధానం రాలేదు. బాధితులు బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడు కిడ్నాప్ అయినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ శనివారం ఉదయం బాల్కొండ ఖిల్లా దగ్గర బాలుడి మృతదేహం లభ్యమవడంతో చిట్టాపూర్ గ్రామానికి సమాచారం అందించారు.

బాలుడి తల ఎడమవైపు బండతో మోది హత్య చేశారని తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్రీధర్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి గ్రామం వైపు వెళ్లింది. రాకేష్ ను తీసుకువచ్చి బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బండి నరేందర్ హతమార్చాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. నిందితుడి ప్రాణం తీస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నిందితుడికి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుని వెంట తీసుకుపోయిన వ్యక్తిని విచారణ చేస్తే ఇలా ఉండేది కాదన్నారు. రాకేష్ మిత్రుడి అన్న మణికంఠ ఫోన్ చేసి నరేందర్ ఖిల్లా వద్దకు తీసుకెళ్లాడని పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. నరేందర్ ను అప్పగించే వరకు శవాన్ని తీయద్దని డిమాండ్​ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి న్యాయం చేస్తామని బాధితులకు మాట ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

Advertisement

Next Story