మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్

by Sridhar Babu |
మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్
X

దిశ,వర్ధన్నపేట : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన బురాన్ పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి ఖమ్మం జైలులో ఉన్న ఏ-1 నిందితుడు పల్లె మురళిని కలవడానికి వెళ్తుండగా పక్కా సమాచారం మేరకు రాయపర్తి గ్రామ శివారులోని హెచ్పీ గోదాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏసీపీ అంబటి నర్సయ్య మంగళవారం వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం సూదుల దేవేందర్ ను హత్య చేయడానికి పల్లె మల్లేష్, అతని కుమారుడు పల్లె మురళిలు హైదరాబాద్ కు చెందిన సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్ణోల్ల కృష్ణయ్య, గోవింద్,

చెన్న రాయుడితో 30 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చు కున్నారు. వాళ్లు తిరగడం కోసం ఒక కారుకు 3 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకు న్నారు. పథకం ప్రకారం పల్లె మల్లేష్, పల్లె మురళి, సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్ణోల్ల కృష్ణయ్య, గోవింద్, చెన్న రాయుడు కలిసి జూలై 7వ తేదీన సూదుల దేవేందర్ ను అతని ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని ముందుగా ముగ్గురు నిందితులు పల్లె మల్లేషం, చెన్న రాయుడు, గోవింద్ లను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏ-1 నిందితుడు పల్లె మురళిని అదుపులోకీ తీసుకున్నారు.

తాజాగా మరో నలుగురు నిందితులు సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్ణోల్ల కృష్ణయ్య, పల్లె ముకేష్ లను రాయపర్తి గ్రామంలో అరెస్ట్ చేశారు. సుంకర ప్రసాద్ గ్యాంగ్ కు పల్లె మురళి ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. సుంకర ప్రసాద్, మార్నేని రాజులపై గతంలో చాలా కేసులున్నాయని, సుంకర ప్రసాద్ పై 3 హత్య కేసులు, 10 నకిలీ నక్సలైట్ కేసులు, 2 కిడ్నాప్ కేసులు, 10 దొంగతనం కేసులు ఉండగా, మార్నేని రాజుపై 3 హత్య కేసులు, 70 దొంగతనం కేసులున్నాయని పోలీసు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సూర్య ప్రకాష్, ఎస్ఐలు ప్రవీణ్, రాజు, శ్రవణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed