ఛత్రినాకలో దారుణం..డబ్బుల కోసం ఘాతుకం

by Aamani |
ఛత్రినాకలో దారుణం..డబ్బుల కోసం ఘాతుకం
X

దిశ, చార్మినార్​ : నేను ఉరి వేసుకుంటున్న కార్తీక్​ ..వెంకటేశ్వర ​ బ్యాండ్​ దుకాణంలో ప్రవీణ్​ , మహేష్​ లు నా మీద పగబట్టారు. పొద్దున మహేష్​ వచ్చి ఎక్కడ పడితే అక్కడ గొట్టిండు కార్తీక్​ ... నాకుభయం అవుతుంది. మాకు బియ్యం పోయలే పూజ మొగుడు మహేష్​ గాడు ..నేను ఉరివేసుకుని చచ్చిపోతున్న కార్తీక్​ ..వాడు నా మీద చాలా పగపట్టిండు .... సేటు గాడు ఏమేం చెప్పిండో ...సేటుగాడు చెబితేనే వీడు నన్ను గొట్టిండు... నేను ఉరి వేసుకుని చచ్చి పోతున్న కార్తీక్​ అంటూ 35 ఏళ్ల యువకుడు వాయిస్​ మెసేజ్​ పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వాయిస్​ మెసేజ్​ కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. బాధితులు ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ ముందు తమకు జరగాల్సిన న్యాయం చేయలేదంటూ ఆందోళనకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం .... లాల్​ దర్వాజా ఓం నగర్​కు చెందిన అనిల్(35) భార్గవి లు దంపతులు. వీరికి ఒక కుమారుడు సంతానం. భార్య భార్గవి నాలుగు నెలల గర్భవతి. జీహెచ్​ఎంసీలో ప్రైవేట్​ జాబ్​ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. అదే ప్రాంతంలో వెంకటేశ్వర బ్యాండ్​ కంపెనీకి చెందిన యజమాని ప్రవీణ్​ వద్ద మిత్తీకి కొంత డబ్బును అరువుగా తీసుకున్నాడు. గత రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిత్తీ కట్టలేక పోయాడు. దీంతో ఈ విషయాన్ని ప్రవీణ్​ తన బ్యాండ్​ కంపెనీ లో ఉండే మహేష్​కు చెప్పాడు. ఈ నెల 11వ తేదీన ఎప్పటిలాగానే శాలిబండ ప్రాంతంలో విధులకు వెళ్ళాడు. అక్కడ డబ్బుల విషయంలో అనిల్​పై మహేష్​ అతడి భార్య దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన అనిల్​ ఛత్రినాకలోని శ్రీరాం నగర్​ కాలనీలోని వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళాడు.

అక్కడ అక్క కొడుకు లేకపోవడంతో నేను ఉరి వేసుకుని చచ్చిపోతున్నా కార్తీక్​ అంటూ వాయిస్​ మెసేజ్​ పెట్టాడు. కార్తీక్​ అక్కడికి చేరుకునే లోపే అనిల్​ ఉరివేసుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అస్రా ఆసుపత్రికి తరలించగా, ఉస్మానియా కు తీసుకెళ్ళాలని వైద్యులు చెప్పారు. దీంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అప్పట్లో అతని భార్య ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తగిన న్యాయం చేస్తామని చెప్పిన పోలీసులు అప్పట్లో ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు. నాలుగు రోజులవుతున్నా తమకు న్యాయం జరగడం లేదని మృతుడు అనిల్​ భార్య, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయకపోతే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని బాధిత కుటుంబం హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed