- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నదాతల ఆత్మహత్యల్లో 81% వారే
వారికి భూమి లేదు. వ్యవసాయం మీద ఆసక్తి ఉంది. సాగు పనులు తప్ప మరేమి తెలియదు. ఊరు విడిచిపోలేరు. కుటుంబాలను విడిచి ఉండలేరు. అందుకే తమకు అందుబాటులో ఉన్న ఇతరులు భూమిని కౌలుకు తీసుకుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుంటారు. ఆరుగాలం శ్రమిస్తారు. పెట్టుబడి కోసం అందినకాడల్లా అప్పులు చేస్తారు. ఎందుకంటే బ్యాంకులు వారిని దగ్గరకు కూడా రానివ్వవు. రుణాలు ఇవ్వవు. మిత్తీకి అప్పులు తెచ్చి రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండిస్తారు. ఆశించిన దిగుబడి వచ్చిందా సరేసరి. రాలేదా అంతే సంగతి. వచ్చిన పంటకూ మద్దతు ధర కూడా అనుమానమే. కన్నీరు తప్ప మరేమి మిగలదు. రుణమిచ్చిన వారు ఊరుకోరు. సర్కారు పట్టించుకోలేదు. మనోధైర్యం కోల్పోయి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న కౌలు రైతులు ఎందరో.!
దిశ, తెలంగాణ బ్యూరో: కౌలు రైతులు చావు దారి పడుతున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. దిగుబడులు రాక ఏటేటా నష్టాలు రావడం, తెచ్చిన అప్పులు తీర్చే దారి లేకపోవడంతో వారు చావును వెతుక్కుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా నమోదు కావడం విషాదకరం. కౌలు రైతులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతుండడం మరింత దారుణం. ఈ ఏడాది ఇప్పటివరకు 468 మంది రైతులు ఊపిరి తీసుకుంటే, వారిలో 379 మంది కౌలు రైతులే. అప్పు తీర్చే దారిలేక ప్రాణాలను బలివ్వడం గుండెలను పిండేస్తున్న నిజం. ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఇవేవీ పట్టవు. కౌలు రైతులను పట్టించుకున్న దాఖలాలు ఉండవు.
ఇంటింటా చావు డప్పు..
పంటకు గిట్టుబాటు లేక కొందరు. అప్పు పుట్టక ఇంకొందరు, అప్పు తీర్చలేక మరికొందరు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోలేక ఇంకొందరు తనువులు చాలిస్తూనే ఉన్నారు. కౌలు రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు 5,661 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ నేర పరిశోధన విభాగం (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు చెబుతున్నాయి. రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్వీ) నివేదికల ప్రకారం 6,380 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గత నవంబర్ 16న ఒక్కరోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
వాస్తవ రైతులను గుర్తించడం లేదు
రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. వాస్తవ సాగుదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అమలుచేసే ధోరణిలో ప్రభుత్వం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది కౌలుదారులున్నా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాల సబ్సిడీ ఇలా అన్నింటినీ పట్టాదారులకే పరిమితం చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకునే సదుపాయం కూడా కౌలు రైతులకు లేదు. ప్రభుత్వం తొలుత కౌలు రైతు రుణ అర్హత కార్డులను జారీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. అది కేవలం ప్రకటనకే పరిమితమైంది.
రిజర్వు బ్యాంకు ఆదేశాలు గుర్తున్నాయా?
ఎటువంటి తనఖా లేకుండా కౌలు రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా రూ.50 వేల వరకూ పంట రుణాలు ఇవ్వవచ్చని 2008 ఆగస్టులో రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. అన్ని వాణిజ్య బ్యాంకులకు సర్క్యులర్లు పంపింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యాంకుల నిరాదరణ కారణంగా కౌలు రైతులు చాలా కాలంగా బ్యాంకు రుణాలకు దూరంగానే వున్నారు. ఉదహరణకు 2013-14 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో 14.55 లక్షల మంది కౌలు రైతులకు ఎల్‌ఈసీ (రుణ అర్హత కార్డులు) లక్ష్యంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. చివరికి జారీ చేసింది మాత్రం 4.39 లక్షల మందికే. వీరికైనా రుణాలు అందాయా అంటే అదీ లేదు. 1.14 లక్షల మందికి మాత్రమే అదీ వారి నుంచి ఏదోఒకటి తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. 2013-14 ఖరీఫ్‌లో రూ.31,996 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకొంటే, రూ.26,609 కోట్లు (83 శాతం) ఇచ్చాయి. ఇందులో కౌలు రైతులకు దక్కింది కేవలం 0.87 శాతం మాత్రమే. అవి కూడా ఆస్తుల తనఖా కిందనే.
రైతుబంధు ఇవ్వమంటే ఇవ్వం
కౌలుదారులపై ముందు నుంచీ ప్రభుత్వం మొండిపట్టుపై ఉంది. కౌలుదారులకు రైతుబంధు వర్తింపచేయమంటూ సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలోనే ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తానన్న పంట రుణాలివ్వలేదు. మొత్తం పంట రుణాలలో పది శాతానికిపైగా కౌలుదారులకు ఇవ్వాల్సి ఉండగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వారిని దగ్గరకు కూడా రానీయడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. గుర్తింపు అర్హత కార్డులు ఉన్న వారికి కూడా బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నారు. కౌలు రైతుకు యజమాని పట్టా పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో ఏం చేయలేని కౌలురైతులు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఎలా తీర్చాలనే బెంగతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కౌలు రైతులే ఎక్కువ
ఏడేండ్లలో మొత్తం 6,380 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 81.4 శాతం మంది కౌలు రైతులేనని స్పష్టమైంది. బలవన్మరణానికి పాల్పడిన రైతుల్లో 700 మంది నేపథ్యాన్ని బేస్న్ సర్వే గా టిస్, ఆర్‌ఎస్వీ బృందం ఇటీవల అధ్యయనం చేసింది. బాధిత రైతు కుటుంబాలతో వారు మాట్లాడిన నేపథ్యంలో వీరిలో 93 శాతం మంది సన్నకారు రైతులేనని తేలగా, వారిలోనూ 520 మంది కౌలురైతులేనని అధ్యయనంలో వెల్లడైంది. 2014 నుంచి 2018 వరకు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 414 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 341 మంది రైతు ఆత్మహత్యలతో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ 196, ఆదిలాబాద్ 173, జయశంకర్ భూపాలపల్లి 170, మెదక్ 166 మంది రైతు ఆత్మహత్యలతో జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో నాల్గో స్థానం మనదే
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలో రైతు ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. 2019 ఏడాది లెక్కల ప్రకారం మొత్తం రాష్ట్రంలో 491 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో 118 మంది కౌలు రైతులున్నారు. మరో 200 మంది కేవలం అర ఎకరం భూమి ఉండి, మళ్లీ రెండెకరాల వరకు కౌలుకు తీసుకున్న రైతులే ఉన్నారు.