సింగరేణిలో తొలిరోజు 7,500 మందికి వ్యాక్సిన్..

by Shyam |   ( Updated:2021-06-13 11:11:06.0  )
singareni
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణిలో ఉద్యోగులు, ఆర్టీజన్లు, కార్మికులకు తొలిరోజు నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. 12 ఏరియాల్లోని 40 సెంటర్ల ద్వారా టీకా అందించగా ఆదివారం 7,500 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. 10 రోజుల మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మొదటి రోజే భారీగా స్పందన వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో మొత్తం 43 వేల మంది కార్మికులు ఉండగా.. వీరిలో శనివారం నాటికి 16 వేల మంది కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తిచేశామని, మిగిలిన 27వేల మంది కార్మికులకు త్వరలోనే టీకా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే 6 జిల్లాలోని 12 ఏరియాల్లో సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లు వ్యాక్సినేషన్ కోసం 40 క్యాంపులను కార్మికులకు అందుబాటులోకి తీసుకువచ్చారని ఆయన చెప్పారు. సింగరేణి వైద్య విభాగానికి చెందిన 56 మంది డాక్టర్లు, 300 మందికి పైగా వైద్యసిబ్బంది ఈ కార్యక్రమంలో సేవలందించారని వివరించారు. అధికారులు పలు సెంటర్లలో ఏర్పాట్లను పర్యవేక్షించారని తెలిపారు. కార్మికులు పలు షిఫ్టుల్లో పనిచేస్తున్నందువల్ల వచ్చే ఆదివారం వరకు అన్ని ఏరియాల్లో కార్మికులందరికీ టీకా అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వ రంగసంస్థల్లో చేపట్టని విధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తమ కార్మికులందరికీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియను మెగా క్యాంపుల ద్వారా నిర్వహిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed