తెలంగాణలో 74 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో 74 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి జోరు కాస్త తగ్గింది. వరుసగా రెండు రోజులు ట్రిపుల్ డిజిట్‌లో కొత్త కేసులు నమోదై కలవరం కలిగించగా గడిచిన 24 గంటల్లో కేసులు తగ్గుముఖం పట్టి డబుల్ డిజిట్‌లో రికార్డయ్యాయి. శనివారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించేసరికి కొత్తగా 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2499కి చేరింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు చనిపోయారు. వీరిలో గడువు కన్నా ముందే పుట్టిన 24 రోజుల మగశిశువు ఉండగా మిగిలిన అయిదుగురు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 77కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 60 రాష్ట్రానికి చెందినవి కాగా సౌదీ అరేబియా నుంచి వచ్చినవాళ్లు అయిదుగురు, వలస కార్మికులు 9 మంది ఉన్నారు. లోకల్‌గా నమోదైన 60 కొత్త కేసుల్లో 42 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం రాజధానిలో కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. శనివారం రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3, మహబూబ్‌నగర్‌లో 2, జగిత్యాలలో 2, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నిజామాబాద్‌లలో ఒకటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1412 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా ప్రస్తుతం 1010 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed