24 గంటల్లో 60 మంది మృతి.. తల్లడిల్లిన పీఎం, సీఎం

by Shamantha N |   ( Updated:2021-07-12 06:23:25.0  )
Thunderstorms
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తరభారతదేశంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పిడుగులు పడి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటలలోనే పిడుగులు పడడంతో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ఈ సంఘటనలు జరిగాయి. యూపీలో 34 మంది చనిపోగా, రాజస్థాన్‌లో 26 మంది మరణించారు. జైపూర్‌ నగరంలో కొందరు మెరుపులతో సెల్ఫీ దిగే యత్నంలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

రాజస్థాన్‌‌లోని జైపూర్, కోట, ఝలవాడ్, దోలాపూర్ తదితర ప్రాంతాలలో పిడుగుల వర్షం కురిసింది. చనిపోయినవారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన 29 మందిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. పిడుగుపాటు ఘటనల మీద రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ సైతం ఈ ఘటనల మీద విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed